పల్లెసీమలను నాశనం చేస్తున్న సీఎం జగన్ మొండి వైఖరి నశించాలని, రానున్న ఎన్నికల్లో వైకాపాను ఓడించేందుకు సిద్ధంగా ఉన్నామని పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వై.వి.బి.రాజేంద్రప్రసాద్ స్పష్టం చేశారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద జిల్లాలోని సర్పంచులు నిరసన వ్యక్తం చేశారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ‘గ్రామీణ ప్రజలకు సమకూర్చిన మా నిధులను సీఎం జగన్మోహన్రెడ్డి దొంగలించారు. పంచాయతీల్లో సర్పంచుల హక్కులను ఇతరులకు అప్పగించారు. మమ్మల్ని నమ్మి మాకు ఓటు వేసిన మా గ్రామ ప్రజలకు కనీసం తాగునీరు కూడా ఇవ్వలేకపోతున్నాం. సర్పంచులు, ఎంపీటీసీల ఆత్మాభిమానం దెబ్బతిని నేడు ఈ ఎండలో రోడ్లపైకి వచ్చాం. రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సిన నిధులు, విధులు, అధికారాలు ఇవ్వండి. సర్పంచులను సీఎం ఉత్సవ విగ్రహాలుగా మార్చారు. మేము విసిగిపోయాం. అందుకే ఇక మేమంతా ఓ నిర్ణయానికి వచ్చాం. రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ను ఓడిస్తేనే మాకు మనుగడ. మా గ్రామాలు బాగుపడతాయి. మా నిధులు మాకు వస్తాయి. వైకాపాను ఓడిస్తేనే గ్రామీణులకు సంక్షేమం లభిస్తుంది. ఇదే నినాదంతో నేడు అన్ని పార్టీలకు చెందిన, ఆఖరికి వైకాపాకు చెందిన సర్పంచులు కూడా ఈ కార్యక్రమంలో భాగమయ్యారు. పంచాయతీరాజ్ మనుగడ కాపాడుకోవాలంటే సీఎంను ఓడించాలి. ఎవరైతే మా గ్రామాలను కాపాడతారో వారికే మా మద్దతు తెలుపుతాం’ అని అన్నారు. కలెక్టర్ ఎదుట నిరసన తెలిపిన అనంతరం స్పందన కార్యక్రమంలోని అధికారులకు వినతిపత్రం అందించేందుకు వెళ్లే తరుణంలో పోలీసులు, సర్పంచులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం అధికారులకు తమ సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు.
source : eenadu.net
Discussion about this post