గాండ్లపెంట మండల కేంద్రంలో సోమవారం కదిరి శాసనసభ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి మగ్బూల్ అహమ్మద్ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో గ్రామ వాలంటీర్లు, ఉపాధి క్షేత్ర సహాయకులు సిద్ధం బ్యాడ్జీలు ధరించి పాల్గొన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా ఎంపీడీఓ పర్యవేక్షణలో పనులు చేయాల్సిన వాలంటీర్లు, క్షేత్ర సహాయకులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. వైకాపా అభ్యర్థి, మండల ప్రజాప్రతినిధుల కంటే ముందుగా వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు అందజేస్తుండటం ఎంత వరకు సబబు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. వారు వైకాపా ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, ప్రభుత్వ కార్యక్రమాలలో మాత్రమే పాల్గొనాలని నిబంధనలు ఉన్నా వాటిని పక్కనపెట్టి వైకాపా అభ్యర్థి, వైకాపా మండల కన్వీనర్, ప్రజాప్రతినిధులను ఆకర్షించేలా వారు ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. ప్రచారానికి అందుబాటులో లేని వాలంటీర్ల సమాచారాన్ని తెలుసుకుని హాజరుకావాలని వైకాపా నాయకులు హుకుం జారీ చేస్తున్నారు.
source : eenadu.net
Discussion about this post