పులివెందుల పట్టణం రాష్ట్రానికే ఆదర్శమని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. వైయస్‌ఆర్ జిల్లా పులివెందులలో రూ.861.84 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సొంతగడ్డపై ముఖ్యమంత్రిగా మీ ముందు నిలిచానంటే మీ అందరి అభిమానం, ఆశీస్సులే కారణమని అన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటినుంచి పులివెందులలో ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టానని తెలిపారు. కాలానుగుణంగా పులివెందుల అభివృద్ధి కొనసాగుతూనే ఉంటుందని వివరించారు. సొంతగడ్డపై మమకారం ఎప్పటికీ తీరిపోయేది కాదని స్పష్టం చేశారు. పర్యటనలో భాగంగా రూ.500 కోట్లు వెచ్చించి అధునాతన వసతులతో నిర్మించిన వైఎస్‌ఆర్ వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి భవనాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. వైద్య కళాశాలలో ఏటా 150 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించడంతోపాటు మొత్తం 750 మంది విద్యార్థులు చదువుకుంటారని సీఎం వివరించారు. 627 పడకల సామర్థ్యంతో బోధనాసుపత్రి, నర్సింగ్ కళాశాల, వసతి భవనాలను నిర్మించామని అన్నారు. అనంతరం రూ.20.15 కోట్లతో నిర్మించిన అరటి ప్రాసెసింగ్ యూనిట్, రూ.38.15 కోట్లతో చేపట్టిన మినీసచివాలయ సముదాయం, పులివెందుల మోడల్‌టౌన్ ప్రాజెక్టులో భాగంగా రూ.11.04 కోట్లతో అభివృద్ధి చేసిన సెంట్రల్ బోలివార్డును ఆయన ప్రారంభించారు. సీఎం అవ్వ వైఎస్ జయమ్మ పేరుతో రూ.20.69 కోట్లతో నిర్మించిన పురపాలక దుకాణ సముదాయం, రూ.65.99 కోట్లతో వంద ఎకరాల్లో ఏర్పాటుచేసిన వైఎస్‌ఆర్ ఉలిమెల్ల లేక్‌ఫ్రంట్‌ను ఆవిష్కరించారు. రూ.175 కోట్లతో ఆదిత్య బిర్లా గ్రూపు ఏర్పాటుచేసిన యూనిట్‌ను ప్రారంభించారు. అనంతరం ఇడుపులపాయకు చేరుకుని రూ.39.13 కోట్లతో నిర్మించిన వైఎస్‌ఆర్ స్మారక పార్కును ప్రారంభించి 48 అడుగుల ఎత్తులో నిర్మించిన వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
source : eenadu.net
Discussion about this post