ముఖ్యమంత్రి జగన్కు తాడేపల్లిలో రాజప్రాసాదం, దాని పక్కనే పేదల గుడిసెలు తొలగించి ప్రభుత్వ ఖర్చుతో నిర్మించిన నాలుగు వరసల రహదారులు, ఇంటి నుంచి కదిలితే రెండు హెలికాప్టర్లు.. ఇలా ఎన్నెన్ని సదుపాయాలో! జగన్కు ఓట్లేసిన ప్రజలు అవస్థలు పడుతుంటే.. ఆయన మాత్రం రాజభోగాలు అనుభవిస్తున్నారు. నాలుగేళ్లపాటు గ్రామాలను ఎంతగానో నిర్లక్ష్యం చేసిన ముఖ్యమంత్రికి ఎన్నికలు ఏడాదిలో ఉన్నాయనగా ప్రజలు మళ్లీ గుర్తొచ్చారు. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి ‘గడప గడపకు మన ప్రభుత్వం’లో సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున ఇస్తున్నట్లు గొప్పగా ప్రకటించారు. వీటినైనా విడుదల చేశారా? పనులు పూర్తి చేయించారా? అంటే రూ.3 వేల కోట్లకుపైగా విలువైన పనుల్లో మొదలైనవి రూ.1,000 కోట్ల పనులే.. వీటిలోనూ పూర్తయిన పనులకు రూ.100 కోట్లకుపైగా బిల్లులు పెండింగ్లో పెట్టారు. సచివాలయానికి రూ.20 లక్షలు కూడా సరిగా ఇవ్వలేని సీఎం జగన్ వేదికెక్కితే.. తమ ప్రభుత్వంలోనే గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారమైందంటూ డప్పు కొట్టుకుంటారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉందా?
పనులిస్తామన్నా.. ముఖం చాటేస్తున్నారు
గడప గడపకు.. కార్యక్రమాన్ని జగన్ సర్కారు ప్రచారం కోసం వాడుకుంటున్నా.. ఇందులో ప్రతిపాదిత పనులు చేయడానికి గుత్తేదారులు ముఖం చాటేస్తున్నారంటే ఎంత అద్భుతంగా అమలు చేస్తున్నారో అర్థమవుతుంది. దాదాపు 65 వేల పనుల్లో 25 వేల పనులు ఇప్పటికీ ప్రారంభమే కాలేదు. వీటికి టెండర్లు పిలిస్తే గుత్తేదారులు ముందుకు రావడం లేదు. పెండింగ్ బిల్లులిస్తే తప్ప టెండర్లు వేయమంటున్నారు. పనులను విభజించి నామినేషన్ కింద ఇద్దామన్నా అధికార వైకాపా కార్యకర్తలు కూడా ససేమిరా అంటున్నారు. ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కృష్ణా, కర్నూలు, తూర్పు గోదావరి, విజయనగరం జిల్లాల్లో అత్యధికంగా పనులు పెండింగ్లో ఉన్నాయి.
పంచాయతీల నీడ పడకుండా
గ్రామాల్లో ఎలాంటి పనులు చేపట్టాలన్నా పంచాయతీల తీర్మానం అవసరం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలైనా ఈ నిబంధన వర్తిస్తుంది. గ్రామ కమిటీకి సర్పంచి ఛైర్మన్గా ఉంటారు. గ్రామ పంచాయతీలను మొదటి నుంచి పథకం ప్రకారం నిర్లక్ష్యం చేసిన జగన్ ప్రభుత్వం ‘గడప గడపకు..’ కార్యక్రమంలో అభివృద్ధి పనులకు కేటాయించిన నిధుల వ్యయంలో సర్పంచుల నీడ పడకుండా చేసింది. పనుల గుర్తింపు, నిధుల కేటాయింపునకు ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో సర్పంచికి స్థానం లేకుండా చేసింది. పంచాయతీకి కాకుండా… వీటి పరిధిలోని సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున అభివృద్ధి పనుల పేరుతో నిధులు కేటాయించింది. ఇంత చేసీ ప్రభుత్వం ఏం సాధించింది? చేసిన పనులకు బిల్లులు పెండింగులో పెట్టి కార్యక్రమాన్ని నీరు గార్చింది.
హామీలిచ్చిన ఎమ్మెల్యేల్లోనూ గుబులు..
గడప గడపకు.. కార్యక్రమంలో ప్రజల ఇళ్లకు వెళ్లి గ్రామాల్లో, పట్టణాల్లో సమస్యల పరిష్కారానికి హామీలిచ్చిన అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో ప్రస్తుతం గుబులు రేగుతోంది. ఇందులో ప్రతిపాదించిన పనుల్లో సగం కూడా పూర్తవ్వకపోవడం, చాలా పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇచ్చిన హామీ నిలబెట్టుకోనందుకు ఎన్నికల వేళ ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదురవుతాయేమోనని ఎమ్మెల్యేలు హడలిపోతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇటీవల నిర్వహించిన ఒక నియోజకవర్గ వైకాపా కార్యకర్తల సమావేశంలో అధికార ఎమ్మెల్యే ఇదే విషయమై ఆవేదన వ్యక్తం చేశారు. పనులు చేయకుండా ప్రజల్లోకి మళ్లీ ఎలా వెళ్లగలమని అన్నారు.
source : eenadu.net
Discussion about this post