తెదేపా, జనసేన, భాజపా మధ్య పొత్తు లెక్క తేలింది. సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. తెదేపా 144, జనసేన 21, భాజపా 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. లోక్‌సభ స్థానాల్లో తెదేపా 17, భాజపా 6, జనసేన 2 చోట్ల పోటీ చేస్తాయి. సోమవారం ఉండవల్లిలోని తెదేపా అధినేత చంద్రబాబు నివాసంలో 8 గంటలకుపైగా మూడు పార్టీల అగ్రనేతల మధ్య సుదీర్ఘంగా జరిగిన చర్చల్లో… ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో, ఏయే సీట్లలో పోటీ చేయాలన్న అంశంపై తుది నిర్ణయానికి వచ్చారు. దిల్లీ నుంచి వచ్చిన కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు, ఎంపీ బైజయంత్ పండాలతో చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సీట్ల సర్దుబాటుపై మొత్తం చర్చలు దిల్లీ నుంచి వచ్చిన భాజపా సీనియర్ నాయకులే పూర్తి చేశారు. వారి దగ్గరున్న సమాచారంతో మిత్రపక్ష నేతలతో చర్చించి, ఖరారు చేశారు. చర్చల్లో కుదిరిన అవగాహన మేరకు.. భాజపా అరకు, అనకాపల్లి, విజయనగరం, రాజమహేంద్రవరం, నరసాపురం, తిరుపతి లోక్‌సభ స్థానాల్లో.. జనసేన కాకినాడ, మచిలీపట్నం లోక్‌సభ స్థానాల్లోనూ పోటీ చేయనున్నాయి. రాజమహేంద్రవరం నుంచి భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజుల అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది. మిగతా నాలుగు స్థానాల్లోనూ బలమైన అభ్యర్థుల్ని నిలిపేందుకు భాజపా కసరత్తు చేస్తోంది. భాజపా మంగళవారం ప్రకటించే రెండో విడత లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ఒకరిద్దరి పేర్లు ఉండొచ్చని భావిస్తున్నారు. అసెంబ్లీ సీట్లకు వచ్చేసరికి భాజపా ధర్మవరం, జమ్మలమడుగు, బద్వేలు, కైకలూరు, విశాఖ ఉత్తరం, పాడేరుతోపాటు మరో నాలుగు స్థానాల్లో పోటీ చేసే అవకాశముంది.
source : eenadu.net










Discussion about this post