రానున్న ఎన్నికల్లో ఎంతమంది ఎన్ని పొత్తులతో వచ్చినా నష్టంలేదని, 175 ఎమ్మెల్యేలతో పాటు 25 ఎంపీ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి చెప్పారు. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలోని పి.గుడిపాడు జాతీయ రహదారి సమీపంలో ఈ నెల 10వ తేదీన నిర్వహించనున్న సిద్ధం సభకు ఏర్పాట్లను ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. నాలుగవ సిద్ధం సభను భారీఎత్తున విజయవంతం చేయడానికి సర్వ సన్నద్ధమవుతున్నామని చెప్పారు.
గత ఐదేళ్లలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి పనుల గురించి సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వివరిస్తారన్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాక రానున్న ఐదేళ్లలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేయబోతుందనే అంశాలను సీఎం ప్రకటిస్తారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు జరిగిన సిద్ధం సభలకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు.
ఆదివారం జరిగే సిద్ధం మహాసభకు సుమారు 15 లక్షల మంది హాజరవుతారని, వచ్చిన వారందరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల వసతులతో ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఈసభ విజయవంతం చేసేందుకు బూత్ లెవల్ కమిటీలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. సభ నిర్వహించే వంద ఎకరాలకు పక్కన మరో వంద ఎకరాలను కూడా సిద్ధం చేశామన్నారు.
source : sakshi.com
Discussion about this post