టీడీపీ, జనసేన పార్టీలకు రానున్న ఎన్నికలే చివరివి కానున్నాయని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన నగరంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు జీవితమంతా కుట్రలు, కుతంత్రాలేనన్నారు. ఆయన ఏనాడూ పేదల సంక్షేమం గురించి ఆలోచన చేయలేదన్నారు. పెనుకొండలో జరిగిన సభలో రాయలసీమ గురించి చంద్రబాబు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడే ఈ ప్రాంతంలో రక్తం ఏరులై పారిన విషయాన్ని మరచిపోయారన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టును శంకుస్థాపనలకే పరిమితం చేసిన ఘనుడు చంద్రబాబు అని విమర్శించారు. 40 టీఎంసీల ప్రాజెక్టును 5 టీఎంసీలకు కుదించింది మీరు కాదా అని ప్రశ్నించారు. హంద్రీనీవా పనులను పరుగులు పెట్టించిన ఘనత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికే దక్కుతుందని, ఆయన చలువతోనే జిల్లాకు కృష్ణా జలాలు వస్తున్నాయన్నారు. తమ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల ముంగిటకే పాలన తీసుకెళ్లిందన్నారు. సచివాలయ, వలంటీర్ వ్యవస్థకు ప్రజల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయన్నారు. గతంలో వలంటీర్ వ్యవస్థను అవహేళన చేసి, నేడు కొనసాగిస్తామని చెబుతుండడం చంద్రబాబు ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. బూటకపు హామీలతో గద్దెనెక్కి అన్ని వర్గాలనూ మోసం చేశారన్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మహిళలకు కుచ్చుటోపీ పెట్టారన్నారు. అధికారం చేపట్టాక మేనిఫెస్టోనే మాయం చేసిన వ్యక్తి, నేడు మళ్లీ అది చేస్తా, ఇది చేస్తా అని చెబుతుండడం హేయమన్నారు. ప్రజలు అమాయకులు కారని, వారే చంద్రబాబుకు మరోసారి గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు.
source : sakshi.com
Discussion about this post