జగన్‌మోహన్‌రెడ్డి అయిదేళ్ల పాలనలో 26 వేల మంది బీసీలపై అక్రమ కేసులు బనాయించారని, 300 మంది బీసీలను చంపేశారని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం తరహాలోనే బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాల్సిన అవసరాన్ని వైకాపా పాలన కల్పించిందని మండిపడ్డారు. వైకాపాలోని బీసీ నాయకులు గుడ్డిగా ఆ పార్టీని వెనకేసుకొస్తే వారి కులాలకు ద్రోహం చేసిన వారవుతారన్నారు. ఇప్పటికైనా వారంతా ఆ పార్టీలో కొనసాగటంపై పునరాలోచించుకోవాలని సూచించారు. ‘జయహో బీసీ’ సభలో మంగళవారం ఆయన మాట్లాడారు. బీసీ కులాల్లోని అనైక్యత వల్లే జగన్ నుంచి ప్రాణరక్షణ కోసం చట్టాలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.
అదే ఈ కులాలన్నీ ఐక్యంగా ఉంటే జగనే కాదు ఎవరొచ్చినా బీసీలను ఏమీ చేయలేరని పేర్కొన్నారు. బీసీలపై దాడులు జరిగితే తమ ప్రాణాలు అడ్డేసి మరీ కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. బీసీలు బాగుండాలనే ఉద్దేశంతోనే వైకాపా వ్యతిరేక ఓటు చీలనివ్వనని ప్రకటించానన్నారు. 153 కులాల సముదాయమైన బీసీలకు జనసేన అండగా ఉంటుందని, వారి అభివృద్ధికి, ఆర్థిక పరిపుష్టికి కృషి చేస్తుందని చెప్పారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి రామ్‌మనోహర్ లోహియా సిద్ధాంతాలు తనను బాగా ఆకర్షించాయని పవన్ చెప్పారు. తెదేపా కూడా ఆవిర్భావం నుంచి లోహియా ఆలోచనలకు అనుగుణంగా బీసీలకు పెద్దపీట వేసిందని గుర్తుచేశారు. వెనుకబడిన కులాలకు అండగా నిలిచి, అధికారం కల్పించిన ఎన్టీఆర్‌ను స్మరించుకున్నారు. ఇంకా అనేక కులాలు అధికారానికి దూరంగానే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలు సాధికారత, రాజ్యాధికారం సాధించాలనేది తన ఆకాంక్ష అని పవన్ కల్యాణ్ ప్రకటించారు.
‘2019 ఎన్నికలకు ముందు ఏలూరులో నిర్వహించిన ‘బీసీ గర్జన’ సభలో జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. బీసీల సంక్షేమం కోసం ఏటా రూ.15 వేల కోట్లు చొప్పున అయిదేళ్లలో రూ.75 వేల కోట్లు ఇస్తామన్నారు. ఈ అయిదేళ్లలో కేటాయించింది సున్నా. 139 బీసీ కులాల కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ సంఖ్యను 56కు కుదించారు. వాటికి బడ్జెట్ కేటాయింపులు కాదు కదా కనీసం కూర్చోవడానికి కుర్చీలైనా లేవు. వైఎస్‌ఆర్ చేయూత కింద 45 ఏళ్లు నిండిన ప్రతి బీసీ మహిళకు అయిదేళ్లలో రూ.75 వేలు అందిస్తామని చెప్పి.. ఇప్పుడు ఆ లబ్ధిదారుల సంఖ్యలో భారీగా కోత విధించారు. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తామని, బడ్జెట్‌లో మూడో వంతు బీసీల కోసం కేటాయిస్తామని ప్రకటించి, మాట తప్పారు. గత ఎన్నికల్లో తన వెన్నంటి ఉన్న బీసీలను జగన్ అధికారం చేపట్టిన మూడు నెలల్లోనే చావుదెబ్బ కొట్టారు. 30 లక్షల మందికి పైగా భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా చేశారు. ఇసుకరీచ్‌లు, క్వారీలను ఓ కంపెనీకి కట్టబెట్టేసి.. అక్కడ పనులు చేసుకుని బతికే వడ్డెరల పొట్టకొట్టారు. 30 మంది భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలకు కారణమయ్యారు. అచ్చెన్నాయుడు లాంటి బీసీ నాయకులపై దాడులు చేశారు. తన అక్కను వేధిస్తున్న వైకాపా నాయకుల్ని ప్రశ్నించినందుకు రేపల్లెలో పదో తరగతి విద్యార్థి అమర్‌నాథ్‌గౌడ్‌పై పెట్రోల్ పోసి తగలబెట్టేశారు’ అని పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు.
source : eenadu.net
Discussion about this post