వెనుకబడిన వర్గాలకు 50 ఏళ్లకే పింఛను అమలు చేస్తామని తెదేపా, జనసేన ప్రకటించాయి. పింఛను మొత్తాన్ని రూ.4 వేలకు పెంచుతామని తెలిపాయి. చంద్రన్న బీమా పునరుద్ధరిస్తామని, బీమా పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చాయి. పెళ్లికానుక పునరుద్ధరించి, రూ.లక్ష చొప్పున అందజేస్తామని తెలిపాయి. వెనుకబడిన తరగతుల ఆర్థిక, రాజకీయ, సామాజిక అభ్యున్నతి, సాధికారతే లక్ష్యంగా మొత్తం పది ప్రధాన అంశాలతో తెదేపా, జనసేన సంయుక్తంగా ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటించాయి. మంగళగిరి నియోజకవర్గంలో మంగళవారం నిర్వహించిన ‘జయహో బీసీ’ సభలో తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ డిక్లరేషన్ విడుదల చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం చేస్తామని పది నెలల క్రితమే ప్రకటించిన తెదేపా దాన్ని డిక్లరేషన్‌లోనూ చేర్చింది. జగన్ పాలనలో 300 మందికి పైగా బీసీలు దారుణ హత్యకు గురయ్యారని, దాడులు, దౌర్జన్యాల నుంచి బీసీలకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తెస్తామని తెలిపింది. సామాజిక న్యాయ పరిశీలన కమిటీ ఏర్పాటు చేసి హక్కులు కాపాడతామని వెల్లడించింది. బీసీ డిక్లరేషన్‌లోని మరిన్ని ముఖ్యాంశాలు..
1.బీసీ ఉప ప్రణాళిక ద్వారా వారి అభివృద్ధికి ఏటా రూ.30 వేల కోట్ల చొప్పున అయిదేళ్లలో రూ.1.50 లక్షల కోట్ల వ్యయం. తెదేపా-జనసేన ప్రభుత్వం ఏర్పడ్డాక బీసీ సబ్‌ప్లాన్ నిధులను వారి కోసమే వినియోగించేలా చట్టపరమైన చర్యలు. వైకాపా ప్రభుత్వం రూ.75 వేల కోట్ల సబ్‌ప్లాన్ నిధులు దారి మళ్లించింది.
2.స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల పునరుద్ధరణ. వైకాపా ప్రభుత్వం రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించడం వల్ల 16,800 మంది బీసీలు పదవులకు దూరమయ్యారు.
3.చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్ కోసం కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం.
4.నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34% రిజర్వేషన్.
5.జనాభా తక్కువగా ఉండి, ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాని బీసీ వర్గాలవారికి కో ఆప్షన్ సభ్యులుగా అవకాశం.
స్వయం ఉపాధికి రూ.10 వేల కోట్లు
1.బీసీల ఆర్థికాభివృద్ధి, ఉపాధికి ప్రోత్సాహకాల పునరుద్ధరణ
2.స్వయం ఉపాధి కల్పనకు అయిదేళ్లలో రూ.10 వేల కోట్లు
3.జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్ల ఏర్పాటు
4.దామాషా ప్రకారం నిధుల కేటాయింపు
5.ఆదరణ పథకం పునరుద్ధరణ. రూ.5 వేల కోట్లతో పరికరాల పంపిణీ
6.మండల, నియోజకవర్గ కేంద్రాల్లో ఉమ్మడి వర్క్‌షెడ్లు, ఫెసిలిటేషన్ కేంద్రాల ఏర్పాటు
7.జగన్‌రెడ్డి రద్దు చేసిన పారిశ్రామిక ప్రోత్సాహకాల పునరుద్ధరణ
శాశ్వత కులధ్రువీకరణ పత్రాలు
1.చట్టబద్ధంగా కులగణన, శాశ్వత కులధ్రువీకరణ పత్రాలు
2.జగన్ ప్రభుత్వం రద్దు చేసిన అన్ని విద్యా పథకాల పునరుద్ధరణ
3.జూనియర్ కాలేజీలుగా నియోజకవర్గాల్లోని రెసిడెన్షియల్ స్కూళ్లు
4.విదేశీ విద్య పథకం షరతులు లేకుండా అమలు
5.పీజీ విద్యార్థులకూ ఫీజు రీయంబర్స్‌మెంట్ పునరుద్ధరణ
6.స్టడీ సర్కిల్, విద్యోన్నతి పథకాల పునఃప్రారంభం
7.ఏడాదిలో బీసీ భవనాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం
source : eenadu.net










Discussion about this post