వందల మంది విద్యార్థినులు చదువుకుంటున్న కళాశాల స్థలాన్ని ఆక్రమించడానికి వైకాపా నాయకులు ప్రయత్నించగా విద్యార్థినులు పొక్లెయిన్‌కు అడ్డంగా బైఠాయించి తమ కళాశాల స్థలాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశారు. అన్నమయ్య జిల్లా కలికిరిలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. నియోజకవర్గంలోని వైకాపాకు చెందిన ఓ కీలక నాయకుడు స్థానిక నర్రావాండ్లపల్లెలో ఇటీవల పర్యటించారు. పార్టీ అధికారంలోకి వచ్చినా తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని కొంత మంది స్థానిక నాయకులు ఆయనను ప్రశ్నించారు. దీంతో ఆయన అధికారులతో మాట్లాడతానని.. కళాశాల స్థలంలో ఇళ్లు నిర్మించుకోవాలని చెప్పినట్లు సమాచారం. దీంతో సదరు వైకాపా నాయకులు సోమవారం పొక్లెయిన్‌తో సహా కళాశాలకు చేరుకుని ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా చదును చేసే పనులను ప్రారంభించారు. విషయం తెలుసుకున్న కళాశాల ప్రిన్సిపాల్ అంజలీదేవి, వైస్ ప్రిన్సిపాల్ ఎస్.గులాబ్‌జాన్, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పనులు నిలిపి వేయాలని సూచించారు. వారిని వైకాపా నాయకులు పరుష పదజాలంతో దూషించారు. కళాశాల విద్యార్థినులు కూడా తమ కళాశాల భూమిని రక్షించుకునేందుకు పొక్లెయిన్‌కు అడ్డంగా కూర్చుని నిరసన తెలిపారు. చేసేది లేక వారు వెనుతిరిగారు. ఈ ఘటనపై ఆర్జేడీ, జాయింట్ కలెక్టర్, తహసీల్దార్, పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి అక్కడకు చేరుకుని విద్యార్థినులకు మద్దతు తెలిపారు.
source : eenadu.net
Discussion about this post