వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కూతురు సునీత ఇన్నాళ్లూ ఎవరి ప్రతినిధిగా మాట్లాడుతున్నారో, తప్పుడు కేసును ఎలా అల్లుతున్నారో బట్టబయలైందని, ముసుగు తొలగిపోయిందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఢిల్లీలో శుక్రవారం మీడియా సమావేశంలో సునీత మాట్లాడిన మాటలే ఇందుకు నిదర్శనమన్నారు. ఆమె మాట్లాడినవన్నీ చంద్రబాబు పలికించినవే అనడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఏమీ ఉండదన్నారు. రాజకీయ కుట్రతోనే సునీతతో చంద్రబాబు మీడియా సమావేశం పెట్టించారని తెలిపారు. సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘వైఎస్ వివేకా ఎమ్మెల్సీగా ఓడిపోవడానికి మేమే కారణమని ఆరోపించడం విడ్డూరం.
కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 2017లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ భారీ మెజార్టీతో గెలవడానికి టీడీపీకంటే వైఎస్సార్‌సీపీకి 160 ఓట్లు ఎక్కువ ఉన్నాయి. అందువల్లే తన చిన్నాన్న వైఎస్ వివేకాను పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ అభ్యర్థిగా నిలబెట్టారు. చంద్రబాబులా ఓడిపోయే సీటుకు పోటీ పెట్టలేదు. వైఎస్ చనిపోయిన తర్వాత వివేకా కాంగ్రెస్‌లోకి వెళ్లి జగన్‌ను రాజకీయంగా అంతుచూడాలని భావించారు. వైఎస్ విజయమ్మపై పులివెందుల శాసన సభ స్థానం నుంచి పోటీకి దిగారు. అయినా వివేకాను జగన్ దగ్గరకు తీసుకున్నారు. వివేకా అడగకుండానే ఆయన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిగా పెట్టారు.
వివేకా సునాయసంగా గెలవాల్సింది. కానీ.. బలం లేకపోయినా ఆయనపై బీటెక్ రవిని చంద్రబాబు పోటీకి దింపి, అప్పట్లో మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డితో కలిసి కుట్ర చేసి ఓడించారు. బీటెక్ రవి, ఆదినారాయణపై వివేకాకు కోపం ఉంది. అందుకే 2019 ఎన్నికల్లో వైఎస్ అవినాష్‌రెడ్డి తరఫున వివేకా అవిశ్రాంతంగా ప్రచారం చేశారు. ఆనాడు తండ్రి వివేకాను కుట్రపూరితంగా ఓడించిన బీటెక్ రవికి సునీత ఇప్పుడు కృజ్ఞతలు చెబుతున్నారు. వివేకాను ఏదన్నా చేయాలంటే బీటెక్ రవి, ఆదినారాయణరెడ్డికే ఎక్కువ అవకాశం ఉంది. వివేకా హత్యకు కారకులైన వాళ్లను కాదని.. ఏడాది తర్వాత ఇంట్లో వాళ్లే హత్య చేశారని సునీత మాటమార్చారు. తండ్రి హత్యకు కారకులైన వారితో జట్టుకట్టి వాళ్లకే కృజ్ఞతలు చెబుతున్నారు’ అని సజ్జల మండిపడ్డారు.
source : sakshi.com
Discussion about this post