జాతిని ఉద్ధరిస్తారని పవన్ కళ్యాణ్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ సామాజికవర్గం ఉడికిపోతోంది. ఆ వర్గాలు ఇక పవన్ కోసం కాపు కాయలేమంటున్నాయి. పవన్ తీసుకుంటున్న నిర్ణయాలు, చంద్రబాబుతో చేసుకున్న రాజకీయ ఒప్పందం మేరకు లభించిన సీట్లతో ఆ సామాజికవర్గం విసుగెత్తిపోయింది. ఇక ముందు పవన్‌ను నమ్మి రాజకీయాలు చేయలేమని ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరుపై ఆయన అభిమానులు, కాపు సామాజికవర్గం వారు బహిరంగంగానే దుమ్మెత్తి పోస్తున్నారు.
టీజే (తెలుగుదేశం–జనసేన) ఉమ్మడి సభలో పవన్ దిగజారుడుతనం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్ రాజకీయాల్లో చక్రం తిప్పాలంటే ఒక రాజకీయ పార్టీగా ఏం చేయాలో, ఏం చేయకూడదో సామాజికవర్గంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వృద్ధతరం మేధావులు సోదాహరణంగా వివరిస్తున్నా పవన్ పెడచెవిన పెట్టడం వారికి ఆవేదన కలిగించింది. పైగా ఆ పెద్దల మాటలు చెవి కెక్కించుకోకపోవడం అటుంచి, అటువంటి వారు తనకు సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన అవసరమే లేదని తెగేసి చెప్పడాన్ని కాపు సామాజిక వర్గంతో పాటు పవన్ అభిమానులు సైతం ఒక పట్టాన జీర్ణించుకోలేకపోతున్నారు.
రాజకీయ యవనికలో కుట్రలకు కేరాఫ్‌గా నిలిచే చంద్రబాబుతో సార్వత్రిక ఎన్నికల్లో పొత్తు ప్రస్తావన వచ్చిన ప్రారంభంలోనే జనసేన నేతలు, పవన్ అభిమానుల్లో పెదవి విరుపు మొదలైంది. ఇందుకు చంద్రబాబుతో పవన్‌కు ఎదురైన అనుభవాలను వారందరూ ప్రస్తావిస్తున్నారు. అయినప్పటికీ లెక్క పెట్టకుండా చంద్రబాబుతో పవన్ చేతులు కలిపారు.
గౌరవప్రదమైన స్థాయిలో సీట్లు తీసుకునే అవకాశం పుష్కలంగా ఉన్నా కూడా, కాదని కాలదన్నుకోవడం పట్ల జనసేన శ్రేణులు, అభిమానుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. సంఖ్యా బలానికి తగిన రీతిలో గౌరవప్రదమైన స్థానాలు దక్కలేదనే ఆవేదన ఆ సామాజికవర్గం అంతటా నెలకొంది. గోదావరి జిల్లాల్లో అపార రాజకీయ అనుభవం కలిగిన చేగొండి హరిరామజోగయ్య మొదటి నుంచీ ముఖ్యమంత్రి పదవితో పవర్ షేరింగ్, కనీసం 50 అసెంబ్లీ స్థానాలు సాధించుకోవాలని పలుమార్లు లేఖల ద్వారా చెబుతూనే ఉన్నారు. అలాగైతేనే జనసేన శ్రేణుల నుంచి ఓట్ షేరింగ్ ఉంటుందని, లేదంటే పొత్తు ధర్మం చిత్తు అవుతుందని అనేక సందర్భాల్లో కుండబద్దలు కొట్టారు.
source : sakshi.com
Discussion about this post