ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందు రెండు ప్రధాన పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే కార్యక్రమాలకు తెరలేపారు. ఎన్నికల్లో గెలుపునకు మహిళా ఓట్లే కీలకం కావాడంతో వారిని ప్రసన్నం చేసుకోవాడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా హిందూపురంలో గడప గడపకూ వైసిపి కార్యక్రమం పేరుతో వైసిపి నాయకులు కరపత్రంతో పాటు మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నారు. తామేమి తక్కువ కాదని రంగంలోకి దిగిన టిడిపి నాయకులు మహా శివరాత్రి పండుగ పేరుతో బాలకృష్ణ, వసుంధర ఫొటోలతో కూడిన క్యాలెండర్, చీరలను పంపిణీ చేస్తున్నారు. ఇలా రెండు పార్టీలు ఎన్నికల నోటిఫికేషన్కు ముందే తాయిలాల పంపిణీకి తెరలేపారు. ఈ పంపిణీ కార్యక్రమం నోటిఫికేషన్ వచ్చే లోపే పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత మరింత పెద్ద ఎత్తున పంపిణీలకు ఇరు పార్టీల వారు రంగం సిద్ధం చేస్తున్నారు. ఓటుకు రూ.2000 అంతకంటే ఎక్కువ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇరు పార్టీలు భారీగా నగదును క్షేత్ర స్థాయి వరకు ఇప్పటికే చేర్చినట్లు బహిరంగంగ చర్చించుకుంటున్నారు. దీనికి అదనంగా మందు సీసాల డంప్లను గ్రామీణ ప్రాంతాల్లో రహస్యంగా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. టిడిపి ఆవిర్భావం నుంచి హిందూపురంలో ఓటమి ఎరుగని కోటపై ఈ సారి వైసిపి జెండా ఎగరవేయాలని ఏకంగా వైసిపి పార్టీ రాయలసీమ కో ఆర్డినేటర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పటికే రంగంలోకి దిగి గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణం వరకు క్షేత్ర స్థాయిలో సమావేశాలను ఏర్పాటు చేశారు. నాయకులు, కార్యకర్తలతో నేరుగ మాట్లాడి పార్టీ గెలుపునకు ఎలా పని చేయాలనే దానిపై దశానిర్దేశం చేశారు. ఇక టిడిపి సైతం గెలుపు కోసం అన్ని అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తోంది. నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి మూడో సారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే కృతనిశ్చయంతో ఉన్నారు. గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి వరకు నాయకులు, కార్యకర్తలతో సమావేశాలను ఏర్పాటు చేశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు అందరితో సెల్ఫీలు దిగుతూ ప్రజల మనసు గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. బాలకృష్ణతో పాటు ఆయన భార్య వసుంధర సంక్రాంతి ముగ్గుల పోటీల పేరుతో మహిళా ఓటర్లను ఆకర్షించారు. ఇలా హిందూపురం నియోజకవర్గంలో టిడిపి, వైసిపి ఎవరికి వారు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఈ పంపిణీలపై ఎన్నికల సంఘం స్పందించకుంటే ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యి ఓటుకు విలువ లేకుండా పోతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Discussion about this post