విశాఖ విమానాశ్రయం నుంచి చినముషిడివాడ వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న తెదేపా ఫ్లెక్సీలు, జెండాలను పట్టణ ప్రణాళిక సిబ్బంది, పోలీసులు ఇటీవల తొలగించారు. ప్రత్యేకించి గోపాలపట్నం సమీపంలోని ప్రైవేటు భవనాలపై అద్దెకు తీసుకుని ఏర్పాటు చేసిన హోర్డింగులను రాత్రికి రాత్రే తీసిపారేశారు.
సీఎం జగన్‌కు ప్రతిపక్ష పార్టీల నేతలే కాదు..ఆ పార్టీల ఫ్లెక్సీలు కూడా నచ్చడం లేదు. ఇటీవల చినముషిడివాడలోని శారదాపీఠంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ హాజరైన సందర్భంగా పట్టణ ప్రణాళికావిభాగం అధికారులు అడ్డగోలుగా వ్యవహరించారు. ముఖ్యమంత్రికి తెదేపా ఫ్లెక్సీలు, జెండాలు కనిపించరాదన్న అధికారుల ఆదేశాలతో సిబ్బంది రాత్రికి రాత్రే వాటిని తొలగించారు. అనుమతి తీసుకుని పెట్టుకున్న వాటిని కూడా విడిచిపెట్టలేదు.
తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు ఫ్లెక్సీలు, హోర్డింగుల విషయంలో అధికార పార్టీ అంటే ఒకలా, మిగతా పార్టీలంటే మరోలా వ్యవహరిస్తున్నారు. నగరంలోని అనేక ప్రాంతాల్లో సీఎం జగన్ ఫొటోతో ఏర్పాటు చేసిన ‘సిద్ధం’ హోర్డింగులు తొలగించాలని జనసేన నాయకులు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇటీవల ధర్నా చేసినా స్పందన లేదు. ఏమంటే ప్రకటనల బోర్డులు లీజుకు తీసుకున్న ప్రైవేటు ఏజెన్సీ పరిధిలోని అంశమంటూ తప్పించుకుంటున్నారు. తెదేపా, జనసేన పార్టీల ఫ్లెక్సీలు, హోర్డింగులు పెడితే అధికారులు క్షణాల్లో స్పందించి తొలగిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ మేయర్ చెప్పినట్లు పట్టణ ప్రణాళిక అధికారులు తలూపుతున్నారు.
source : eenadu.net
Discussion about this post