ఎన్నికలయ్యే వరకు ప్రతి వారం సర్వే చేయిస్తా.. పనితీరు బాగాలేదని తేలితే అభ్యర్థుల్ని మార్చేందుకూ వెనుకాడబోనని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. తెదేపా తొలి జాబితాలో సీట్లు దక్కించుకున్న అభ్యర్థులతో ఆదివారం ఆయన టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వారికి శుభాకాంక్షలు చెబుతూనే.. టికెట్లు వచ్చాయనే నిర్లక్ష్యం తగదని, వచ్చే 40 రోజులు అత్యంత కీలకమంటూ దిశానిర్దేశం చేశారు. ‘ఎవరైనా అసంతృప్తితో ఉంటే.. ఒకటికి పదిసార్లు స్వయంగా మీరే వెళ్లి కలవండి. నేనే అభ్యర్థిని అనే అహంతో వ్యవహరిస్తే కుదరదు.. తటస్థులనూ కలవండి. జగన్ పాలనలో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని వివరించండి. అన్ని వర్గాల మద్దతు కోరండి. జనసేన మన మిత్రపక్షం. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలను గౌరవించాలి. వారితో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలి. ప్రజలకు భవిష్యత్తుపై నమ్మకం, ధైర్యం కలిగేలా నాయకత్వాన్ని అందించండి. విధ్వంస పాలకుడైన జగన్‌ను ఓడించేందుకు జనం సిద్ధంగా ఉన్నారు. ప్రజలతో ఓట్లు వేయించుకోవాల్సింది మీరే. వైకాపా కార్యకర్తలు, నేతలూ జగన్ పాలనపై అసంతృప్తితో ఉన్నారు. మంచివారు వస్తే పార్టీలోకి ఆహ్వానించండి’ అని స్పష్టం చేశారు.
ఒక్క సీటూ ఓడిపోవడానికి వీల్లేదని, ఒక్క పొరపాటు కూడా జరగకూడదని చంద్రబాబు సూచించారు. ఎంత సీనియర్ నేత అయినా, నియోజకవర్గంలో ఎన్ని సానుకూల అంశాలున్నా.. చివరి నిమిషం వరకు ప్రజల్లోనే ఉండాలి, కష్టపడాలి. రెండు పార్టీల నేతలు సమన్వయంతో పనిచేస్తే 100% ఓట్ల బదిలీ జరుగుతుంది. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తుకు ఎంతో కీలకం. 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు కోసమే తెదేపా-జనసేన పొత్తుతో పోటీ చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1.3 కోట్ల మంది అభిప్రాయాలు సేకరించి.. సర్వేలు పరిశీలించాం. సుదీర్ఘ కసరత్తు తర్వాతే అభ్యర్థుల్ని ఎంపిక చేశాం’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
‘జగన్ తన ఐదేళ్ల పాలనను నమ్ముకోలేదు. దౌర్జన్యాలు, అక్రమాలు, దొంగ ఓట్లు, డబ్బును నమ్ముకున్నారు. ఊహించని స్థాయిలో కుట్రలు, కుతంత్రాలు చేస్తారు. అన్నింటికీ సిద్ధంగా ఉండాలి. ప్రచార విభాగాన్ని బలోపేతం చేసుకోండి. ప్రతి అభ్యర్థి ఒక న్యాయవాదిని పెట్టుకోండి. ‘సిద్ధం’ సభలు పెడుతున్న జగన్.. ఎన్నికలకు ఎంతమాత్రం సిద్ధంగా లేరు. అందుకే అభ్యర్థుల్నీ ప్రకటించలేకపోయారు. జగన్ అహంకారంతో చేసిన విధ్వంసమే.. ఆయన పతనానికి నాంది కాబోతోంది’ అని చంద్రబాబు విమర్శించారు. ప్రభుత్వ విధానాలు, స్థానిక ఎమ్మెల్యేల పనితీరును ఎండగట్టేలా కార్యక్రమాలు తయారు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల వరకు రోజువారీ చేపట్టాల్సిన ప్రణాళికపై ఈ సందర్భంగా వారితో చర్చించారు.
source : eenadu.net
Discussion about this post