ఇంటి పట్టాల ఉత్తుత్తి రిజిస్ట్రేషన్లతో పేదల్ని అయోమయానికి గురిచేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్. కన్వీనియన్స్ డీడ్ రూపంలో జరుగుతున్న ఈ రిజిస్ట్రేషన్ల వల్ల లబ్ధిదారులకు ఎలాంటి ప్రయోజనం లేకపోయినా ప్రచార యావతో ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు. అసలు కన్వీనియన్స్ డీడ్ పేరుతో రిజిస్ట్రేషన్లు జరగడం ఇదే తొలిసారి. ఈ హడావుడి ప్రక్రియ ప్రారంభమై రెండు వారాలు గడిచినా రకరకాల సాంకేతిక సమస్యలతో ముందుకు సాగడం లేదు. ఇప్పటికే అమల్లో ఉన్న నిర్ణయం ప్రకారం పట్టా కేటాయించిన పదేళ్ల తర్వాతే లబ్ధిదారులకు యాజమాన్య హక్కులు లభిస్తాయి. అయినా కన్వీనియన్స్ డీడ్‌లతో ఏదో ఉపయోగం ఉన్నట్లు రిజిస్ట్రేషన్ల పేరుతో లబ్ధిదారులను ప్రభుత్వం మభ్యపెడుతోంది. ఈ క్రమంలో గతంలో దొర్లిన తప్పులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పట్టాల్లో పేర్లు, సర్వే నంబరు, ప్లాట్ నంబరు, స్థలం హద్దులు తప్పుగా నమోదవడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ముందుకు సాగడం లేదు. పొలాలు, చెరువులు, కొండగట్లలో లేఅవుట్లు వేసి, పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వలేదు. మొదట పట్టాలిచ్చి, తర్వాత సీఎం ఫొటోతో సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల పేరిట ప్రచారం చేసుకుంటోంది. చదును చేయనందున చాలా జిల్లాల్లో లేఅవుట్లలో పిచ్చిమొక్కలు మొలిచాయి. చాలాచోట్ల స్థలాలు అనువుగా లేకపోవడం, దూరంలో ఉన్నందున లబ్ధిదారులు అక్కడికి వెళ్లేందుకు విముఖత చూపుతున్నారు. వారి అభ్యర్థనలపై పునఃపరిశీలన చేయకుండానే రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు.
ప్రకాశం జిల్లా పొదిలిలో ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ అర్ధంతరంగా నిలిచింది. జిల్లాలోనే ఒకేచోట ఎక్కువ మంది పేదలకు పట్టాలిచ్చిన లేఅవుట్‌గా ఉన్న సర్వే నంబరు 1177లోని ప్లాట్ నంబర్లకు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది. అయితే.. సర్వే నంబర్లు 1195, 1193గా ఆన్‌లైన్‌లో గతంలోనే నమోదు చేశారు. ఈ పరిస్థితుల్లో ఒక సర్వే నంబరుతో రిజిస్ట్రేషన్ చేస్తే పట్టా పొందిన వ్యక్తి స్థలం మరో నంబరులోకి మారిపోతోంది. దీంతో ఇక్కడ రిజిస్ట్రేషన్లను నిలిపేశారు. మండలంలో 2,350 మందికిగాను ఇప్పటివరకు సుమారు 400 మందికి మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగాయి.
లబ్ధిదారుల్లో కొందరికి వారి నివాస ప్రాంతాలకు 15-20 కి.మీ. దూరంలో స్థలాలిచ్చారు. ఏ గ్రామంలో స్థలాలు ఇచ్చారో.. ఆ గ్రామ సచివాలయ అధికారితోపాటు లబ్ధిదారు రిజిస్ట్రేషన్ కోసం బయోమెట్రిక్ వేయాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇదో పెద్ద సమస్యగా మారింది. కాకినాడ జిల్లా సామర్లకోట గ్రామీణ మండలంలోని వి.కె.రాయపురం ముంపు ప్రాంతంలో… అదీ 6కి.మీ. దూరంలో చిన్నపాటి వర్షానికే మునిగిపోయే పొలాల మధ్య కొన్న స్థలాలు తమకొద్దని.. వేరేచోట ఇవ్వాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. స్థలాలు ఇవ్వకుండానే రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని మండిపడుతున్నారు.
source : eenadu.net
Discussion about this post