అనంతపురం అర్బన్ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిపై ఇంటా బయటా వ్యతిరేకత నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ ఇవ్వొద్దని సొంత పార్టీ నేతలే అధిష్టానాన్ని కోరుతున్నారు. మరోవైపు ఎన్నికలకు సమాయత్తమయ్యేందుకు ప్రచారానికి శ్రీకారం చుడితే.. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. దీంతో వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
2019లో తెలుగుదేశం పార్టీ తరఫున అర్బన్ నియోజకవర్గంలో పోటీచేసి దారుణ ఓటమి పాలైన ప్రభాకర్ చౌదరి ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్లిన దాఖలాలు లేవు. తాజాగా ఎన్నికలు దగ్గర పడటంతో ప్రచారానికి తెరతీశారు. ఇటివల కొన్ని వార్డుల్లో ప్రచారం ప్రారంభించారు. ‘ఎన్నికల్లో ఓడిపోయాక ఎప్పుడూ కనపడలేదు కదా, ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని వస్తున్నారా’ అని మహిళలు ప్రశ్నించడంతో చౌదరి నిశ్చేష్టులయ్యారు. సర్ది చెప్పాలని చూసినా ప్రశ్నిస్తూనే ఉండటంతో ఒకింత అసహనానికి గురయ్యారు. ఇదే అదునుగా.. ఒకవేళ చౌదరికి టికెట్ వచ్చినా పరిస్థితి ఆయనకు ఏ మాత్రమూ సానుకూలంగా లేదని టీడీపీ నేతలు చెబుతున్నారు.
ప్రజల్లో ఎలాగూ వ్యతిరేకత ఉంది.. కనీసం పార్టీలోనైనా బావుందంటే అదీ లేదు. ఇప్పటికే ఆయన వ్యతిరేక వర్గం కత్తులు దూస్తోంది. మైనార్టీలు పూర్తిగా దూరమయ్యారు. ప్రభాకర్ చౌదరి మున్సిపల్ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అవినీతి చిట్టా బయటపెడతామని బలిజ సామాజిక వర్గానికి చెందిన నేతలు కొందరు హెచ్చరిస్తున్నారు. అర్బన్ నియోజకవర్గం ఆయన సొత్తేమీ కాదని, ఆయనకు టికెట్ ఇస్తే పార్టీ ఆనవాళ్లు కూడా మిగలవని అంటున్నారు. దీంతో ఇప్పుడు చౌదరి వర్గం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటోంది. ఓవైపు జనసేన పొత్తులో టికెట్ పోతుందని కొందరు, సీటు టీడీపీకే వచ్చినా చౌదరికి టికెట్ వద్దని మరికొందరు అంటున్నారు. దీంతో చౌదరి పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారింది.
source : sakshi.com
Discussion about this post