నారా భువనేశ్వరి చెప్పినట్లుగా చంద్రబాబుకు రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు జ్ఞాపకశక్తి పూర్తిగా తగ్గిపోయి భవిష్యత్తులో విధానపరమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం లోపిస్తున్నట్లుగా నారా భువనేశ్వరి గుర్తించి కుప్పం బరిలో తానే నిలుస్తున్నట్లుగా పేర్కొనడంపై ఆయన స్పందించారు. తన భర్తను 35 ఏళ్లుగా ఆదరించారని ఈసారి ఆయనకు రెస్ట్ ఇచ్చి తాను బరిలో నిలవాలని అనుకుంటున్నట్లుగా తన మనసులోమాటను ఆమె బహిర్గతం చేసిందన్నారు. లేదంటే ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన పార్టీని నారా కుటుంబం లాగేసుకుందనే బాధ ఆమెలోనూ నెలకొని ఆ పార్టీ బాధ్యతలు తీసుకోవాలనే ఆలోచన కూడా అయిండొచ్చన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో గొప్ప పరిపాలన సాగుతోందన్నారు. సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లో రూ.2.55 లక్షల కోట్లు నేరుగా జమ చేశారన్నారు. 22 లక్షల ఇళ్లు మంజూరు చేశారన్నారు. 30 లక్షల ఇంటిపట్టాలు ఇచ్చారన్నారు. ఇంత మేలు చేశారు కాబట్టే కుప్పం స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్ చేసిందన్నారు. చంద్రబాబు 30 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండికూడా ఆ నియోజకవర్గం అభివృద్ధి చెందిందేమీ లేదన్నారు. 30 వేలమంది పక్కనే ఉన్న తమిళనాడుకు ఉపాధి కోసం వెళ్తున్నారన్నారు. 30 వేలమంది తమిళుల ఓట్లను చంద్రబాబు ఎక్కించుకున్నట్లు అధికారుల పరిశీలనలో తేలిందన్నారు. ఈ పరిస్థితుల్లో ఆ నియోజకవర్గంలో గెలవడం అసాధ్యం అనే విషయం చంద్రబాబు దంపతులిద్దరికీ తెలుసన్నారు. దీంతో ఎన్టీఆర్ కూతురిగా తనకేమైనా అవకాశం ఇస్తారేమోనని భువనేశ్వరి ఆశపడుతోందన్నారు. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ జీరో అయిందన్నారు. తాజాగా రాజ్యసభలో జీరో అయిందన్నారు. రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో 175 స్థానాలూ వైఎస్సార్‌సీపీ గెలవబోతోంది కాబట్టి ఇక్కడి అసెంబ్లీలోనూ జీరో అవుతుందన్నారు. ఇక లోక్‌సభ స్థానాలను క్లీన్‌స్వీప్ చేయనుండడంతో అక్కడ కూడా టీడీపీ జీరో అవుతుందన్నారు. మొత్తం మీద టీడీపీ పెద్ద గుండుసున్నాగా మారి బీజేపీలో విలీనం అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు.
source : sakshi.com
Discussion about this post