వెంటిలేటర్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చిన మహానేత వైఎస్సార్ పేరును ఆయన మరణం తరువాత ఎఫ్‌ఐఆర్‌లో చేర్చి అవమానించిన కాంగ్రెస్ పార్టీలో చేరడమే కాకుండా తప్పుడు మాటలు మాట్లాడుతున్నావని పీసీసీ అధ్యక్షురాలు షర్మిలపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్‌ను అడ్డగోలుగా విభజించడమే కాకుండా ఇప్పటికీ రాజధాని లేని రాష్ట్రంగా తయారుచేసిన కాంగ్రెస్, టీడీపీలతో జతకట్టి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదన్నారు. వాస్తవాలు మాట్లాడడం షర్మిల నేర్చుకోకపోతే రానున్న కాలంలో ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఆమె హెచ్చరించారు. విశాఖలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు.
పొరుగు రాష్ట్రం నుంచి ఇక్కడకు వచ్చి ప్రభుత్వంపై అవాస్తవాలు మాట్లాడడం సబబు కాదని హితవు పలికారు. ఏపీలో గ్రామ సచివాలయ వ్యవస్థను యావత్తు దేశమే పొగుడుతుంటే షర్మిల సచివాలయ వ్యవస్థపై బురదజల్లేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగ నియామక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగిందని.. వలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల మధ్య తేడా కూడా తెలియకుండా మాట్లాడడం ఆమె అవగాహనారాహిత్యమని వరుదు కళ్యాణి విమర్శించారు.
source : sakshi.com
Discussion about this post