‘ముఖ్య’ నేత సోదరుడు, ప్రభుత్వ సలహాదారు ఒకరు, ఎన్నికలపై సర్వేలు నిర్వహించే ఓ వ్యక్తి, గతంలో కార్పొరేట్ సంస్థకు ఏపీ ప్రతినిధిగా వ్యవహరించిన గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి..రాష్ట్రంలో ఇసుక మాఫియాను నడిపిస్తున్నది ఈ నలుగురే. సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎన్జీటీలను లెక్క చేయకుండా భారీ దోపిడీకి పాల్పడుతున్నది వీరే. అందుకే కళ్లెదుటే ఇసుక తవ్వకాలు జరుగుతున్నా సరే, అడ్డుకునే ప్రయత్నం చేయకుండా కలెక్టర్లు వణికిపోతున్నారు. కనీసం ‘తవ్వకాలు నిజమే’ అని అంగీకరించేందుకూ భయపడిపోతున్నారు. నేరుగా ‘ముఖ్య’నేత ఆగ్రహానికి గురవుతామని ఆందోళన చెందుతున్నారు. అందుకే ఏకంగా 20 జిల్లాల కలెక్టర్లు తమ పరిధిలో ఇసుక తవ్వకాలు జరగలేదని, తమ పరిశీలనలో అవేవీ కనిపించలేదంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ)కు నివేదిక ఇచ్చారు. ముఖ్య నేత సోదరుడితో పాటు నలుగురితో కూడిన ఇసుక మాఫియా బృందం సూచించినట్లే ఇసుక తవ్వకాల్లేని రీచ్‌లనే కలెక్టర్లు పరిశీలించి, తవ్వకాల్లేవంటూ నివేదిక ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. కానీ కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ (ఎంవోఈఎఫ్)కు చెందిన అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేసి ఇసుక దోపిడీ నిజమని తేల్చారు. దీంతో కలెక్టర్ల నివేదికలపై ఎన్జీటీ ఆశ్చర్యపోయింది. కలెక్టర్లు మరీ ఇంతలా ఎందుకు దిగజారిపోయారు? ప్రభుత్వ తాబేదార్లుగా ఎందుకు మారిపోయారు అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. బుధవారం ఎన్జీటీ తీవ్ర వ్యాఖ్యలు చేసినప్పటికీ.. గురువారం కూడా తవ్వకాలు యథవిధిగా కొనసాగాయి.
జిల్లా పాలనా వ్యవహారాలతో యంత్రాంగానికి మార్గనిర్దేశకులుగా నిలవాల్సిన కలెక్టర్లు.. ఇసుక మాఫియాకు జీ హుజూర్ అంటున్నారు. అక్రమ తవ్వకాల్లేవంటూ ఎన్జీటీకి తప్పుడు నివేదికలు ఇచ్చి.. పరువు పోగొట్టుకున్నారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, వైయస్‌ఆర్, అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి, నంద్యాల జిల్లాల కలెక్టర్లు ఇటీవల తమ జిల్లాల్లో రీచ్‌లను పరిశీలించారు. ఏ రీచ్‌లలో పెద్దఎత్తున తవ్వకాలు జరుగుతున్నాయో తెలిసినప్పటికీ.. వీరంతా వాటి జోలికి వెళ్లలేదు. అసలు తవ్వకాల్లేని చోట తనిఖీలు చేశారు. ఎక్కడా తవ్వకాల్లేవంటూ నివేదికలిచ్చి చేతులు దులిపేసుకున్నారు. కానీ, నిప్పులాంటి నిజం ఎంవోఈఎఫ్ రూపంలో బయటపడింది. ఎక్కడెక్కడ ఏం జరుగుతోంది? ఇసుక మాఫియాకు, గుత్తేదారుకు రాష్ట్ర ప్రభుత్వం, గనుల శాఖ ఎలా సహకరిస్తోందో వీరి నివేదిక కళ్లకు కట్టింది. కేవలం ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని తనిఖీలతోనే ఎంవోఈఎఫ్ ఇసుక దోపిడీని నిగ్గుతేల్చింది. ఈ బృందం మిగిలిన జిల్లాలకూ వెళ్తే.. అక్కడి అధికారుల బండారం బయటపడనుంది.
source : eenadu.net
Discussion about this post