ఉత్తరాంధ్రకు జగన్ సర్కారు ఐదేళ్లలో ఉత్తి చేతులు చూపింది. ఈ ప్రాంతానికి చెందిన ఒక్క సాగునీటి ప్రాజెక్టునూ పూర్తి చేయలేకపోయింది. వెనకబడిన జిల్లాలకు సాగునీటి ప్రాజెక్టులే కీలకాధారం. సాగులోకి తీసుకురావాల్సిన ఆయకట్టు ఎంతో ఉన్నా ప్రాజెక్టుల నిర్మాణాన్ని గాలికి వదిలేసింది. ఉత్తరాంధ్రపై జగన్ తన ప్రసంగాల్లో కురిపిస్తున్న ప్రేమ… చేతల్లో ఎక్కడా కనిపించడం లేదు. ఇక్కడి ప్రాజెక్టులకు నిధులివ్వలేదు. ఆఖరికి తొలి ఏడాదిలోనే పూర్తి చేస్తామని ఘనంగా లక్ష్యాలు విధించుకున్న వంశధార రెండో దశకు చెందిన రెండో భాగం, వంశధార-నాగావళి అనుసంధానం ప్రాజెక్టులనూ పూర్తి చేయలేదు. ఈ ప్రాంత సాగు, తాగునీటి అవసరాలను తీర్చడానికి గత తెదేపా హయాంలో చేపట్టిన ప్రాజెక్టులకు అన్నింటికీ రూ.3,288.52 కోట్లు కేటాయించాల్సిన ఉండగా… ఐదేళ్లలో రూ.594.74 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఈ నేపథ్యంలో అవన్నీ ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది.
source : eenadu.net
Discussion about this post