వయసు మళ్లిన నాయకులు పదవుల కోసం పాకులాడటం పద్ధతి కాదని, రాజకీయాల్లోనూ రిటైర్‌మెంట్ తీసుకుని కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో బుధవారం ఆయన పలువురు టీడీపీ, బీజేపీ నాయకులను మర్యాద పూర్వకంగా కలిసిన అనంతరం కాళ్ల మండలం పెదఅమిరంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాల్లో పూర్వపు పశ్చిమగోదావరి జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఒక వయసు వచ్చాక రాజకీయాల్లో ఉండకూడదని చెప్పారు.
80–90 ఏళ్ల వయసు వచ్చే వరకు రాజకీయం చేస్తామంటే కొత్త వాళ్లకు అవకాశాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. అలాంటి వారు రిటైర్‌మెంట్ తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. తాను కూడా 30 ఏళ్ల వయసులోనే సినిమా రంగం నుంచి రిటైర్‌మెంట్ తీసుకుని కొత్త తరానికి అవకాశం ఇచ్చేందుకు ప్రణాళిక రచించుకున్నానని చెప్పారు. నేటి సమాజంలో డబ్బులేని రాజకీయాలు సాధ్యం కావని, డబ్బులు ఖర్చు చేయకుండా రాజకీయాలు చేయాలని తాను ఏనాడూ చెప్పలేదని తెలిపారు. ఎవరికీ భోజనాలు పెట్టకుండా రాజకీయం చేసేస్తానంటే కుదరదన్నారు. డబ్బులు ఖర్చులు పెట్టాలన్న విషయాన్ని ఇప్పటికే నాయకులకు చెప్పానని తెలిపారు.
ఓట్లు కొంటారో.. ఏం చేస్తారో తాను చెప్పనని, అది మీరే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కులపరంగా జరిగే గొడవలను పార్టీలకు అంటగట్టడం మంచిది కాదని, కులంలో ఒకరు తప్పుచేస్తే ఆ తప్పును మొత్తం కులంపై మోపుతున్నారన్నారు. ఈ సందర్భంగా భీమవరంలో కాపులు–రాజుల మధ్య, తూర్పుగోదావరి జిల్లాలో కాపు–శెట్టిబలిజ కులాల మధ్య ఉన్న గొడవలను పవన్‌కళ్యాణ్ ప్రస్తావించారు.
ఇదిలా ఉండగా, జనసేన పార్టీ.. అన్ని కులాలను సమ దృష్టితో చూస్తుందని చెప్పిన పవన్.. వేదికపై కాపు, క్షత్రియ సామాజిక వర్గాలకు చెందిన ఇద్దరు నేతలకు మాత్రమే స్థానం కల్పించడం.. బీసీ, ఎస్సీ నాయకులెవరికీ అవకాశం ఇవ్వకపోవడం అక్కడ చర్చనీయాంశంగా మారింది. కాగా, రాజకీయాల్లో రిటైర్‌మెంట్ విషయం చంద్రబాబును ఉద్దేశించేనని, ఏదో వ్యూహం మేరకే కుప్పంలో భువనేశ్వరి, ఇక్కడ పవన్ ప్రస్తావించారని పలువురు నేతలు చర్చించుకున్నారు.
source : sakshi.com
Discussion about this post