పత్రికా కార్యాలయాలు, పాత్రికేయులపై వైకాపా గూండాల దాడులను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలు, ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు కదం తొక్కాయి. వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడికక్కడ ర్యాలీలు, ధర్నాలు, మానవహారాలు చేపట్టి నిరసన వ్యక్తం చేశాయి. ఎన్నికల్లో గెలవలేమనే భయంతోనే ముఖ్యమంత్రి జగన్ ఈ తరహా దాడులకు పురిగొల్పుతున్నారని విరుచుకుపడ్డాయి. ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మండిపడ్డాయి. దాడులు ఇలాగే కొనసాగితే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించాయి. ఆందోళనల్లో తెదేపా, జనసేన, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంతో పాటు ఏఐఎస్‌ఎఫ్, టీఎన్‌ఎస్‌ఎఫ్, గిరిజన విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు. దాడులను ముక్తకంఠంతో ఖండించారు. దాడులకు పాల్పడిన వారిని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీ, ఆర్‌డీవో, తహసీల్దార్‌లకు వినతిపత్రాలు ఇచ్చారు. జర్నలిస్టులపై దాడులు జరగకుండా కఠిన చట్టాలను తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. ‘ఈనాడు’ కార్యాలయంపై దాడిని నిరసిస్తూ చలో కర్నూలు, ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌పై దాడిని నిరసిస్తూ గురువారం చలో అనంతపురం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ వెల్లడించారు.
కార్యకర్తలను రెచ్చగొడుతున్న జగన్
గుంటూరులో ఏపీడబ్ల్యూజేఏ ఆధ్వర్యంలో జర్నలిస్టులు, తెదేపా నేతలు నక్కా ఆనంద్‌బాబు, కన్నా లక్ష్మీనారాయణ, నజీర్ అహమ్మద్, డి.ప్రభాకర్ ఆందోళన నిర్వహించారు. హిందూ కళాశాల కూడలిలో మానవహారం నిర్వహించారు. నక్కా ఆనంద్‌బాబు మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ అకృత్యాలు బయటపెడుతుంటే తట్టుకోలేకనే వైకాపా కార్యకర్తలు మీడియాపై దాడులకు తెగబడుతున్నారు. నియంతృత్వ ధోరణితో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని హెచ్చరించారు. కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ‘చొక్కాలు మడతపెట్టమంటూ సీఎం జగన్ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు’ అని మండిపడ్డారు.
ఎన్నికల్లో గెలవలేమనే భయంతోనే దాడులు
విజయనగరంలో ఏపీయూడబ్ల్యూజే, ఏపీయూడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్‌లో గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. గజపతినగరం తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి కేఏ నాయుడు, భోగాపురం మండలంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి కర్రోతు బంగారాజు, పాలకొండలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి రామమల్లిక నాయుడు, పలువురు ఆందోళనలు నిర్వహించారు. ఎన్నికల్లో గెలవమనే భయంతోనే ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తోందని తెదేపా నియోజకవర్గం ఇన్‌ఛార్జి అశోక్‌గజపతిరాజు విమర్శించారు. మీడియాని భయబ్రాంతులకు గురిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు.
source : eenadu.net
Discussion about this post