‘సిద్ధం’ సభలకు తరలివస్తున్న ప్రజలను చూసి ప్రతిపక్షాలు బెంబేలెత్తుతున్నాయని ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, మాలగుండ్ల శంకర్‌నారాయణ అన్నారు. మంగళ వారం నగరంలోని 40వ డివిజన్ ఆజాద్‌నగర్‌లో ‘ఇంటింటికీ వైఎస్సార్ సీపీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ పార్లమెంట్ సమన్వయకర్త మాలగుండ్ల శంకర్‌నారాయణతో కలసి ఎమ్మెల్యే అనంత ప్రతి గడపకూ వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధికి సంబంధించిన కరపత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ నాయకత్వంపై ప్రజలకు అపారమైన విశ్వాసం ఉందన్నారు. ‘సిద్ధం’ సభలకు వస్తున్న ప్రజాదరణను ఓర్వలేక ప్రతిపక్ష నాయకులు అవాకులు, చవాకులు పేలుతున్నారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం జగన్ సభలకు జనం తరలివస్తున్నారన్నారు. ఆయన పాలనలో పేద ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఆరోగ్యశ్రీ వైద్య సేవల పరిమితిని రూ.25 లక్షలకు పెంచి పేదలకు ఖరీదైన వైద్యం ఉచితంగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ, బెంగళూరు, చైన్నెలాంటి ప్రాంతాల్లోనూ కార్పొరేట్ వైద్యం అందిస్తోందన్నారు.
ఎమ్మెల్యే మాలగుండ్ల శంకరనారాయణ మాట్లాడుతూ ‘ఇంటింటికీ వైఎస్సార్ సీపీ’ కార్యక్రమాన్ని ప్రజలు సంతోషంగా స్వాగతిస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లోనూ వైఎస్సార్ సీపీకే ఓటు వేస్తామని చెబుతున్నారన్నారు. సీఎంగా జగన్‌మోహన్ రెడ్డి మళ్లీ ఎన్నికవడం ఖాయమన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో అనంతపురం నగరం అభివృద్ధికి నోచుకోలేదని, తమ ప్రభు త్వం వచ్చాక రూపురేఖలు మారిపోయాయన్నారు. ప్రధాన రోడ్లతో పాటు మారుమూల ప్రాంతాల్లోనూ రోడ్లు, కాలువలు, కమ్యూనిటీ హాళ్లు, లైటింగ్ తదితర అభివృద్ధి పనులు జరిగాయన్నారు. సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని కోరారు.
source : sakshi.com
Discussion about this post