ఉమ్మడి అనంతపురం జిల్లాలోని వైకాపా ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్నారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు అవకాశాలు అల్లంత దూరంలో కూడా కనిపించడం లేదు. దీంతో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో ఎన్నికల సమయంలో కుట్రలు చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. ఇందులో భాగంగానే అల్లరి గుంపుపై ఉన్న రౌడీషీˆట్లను తొలగింపజేస్తున్నారు. ఇందుకు ఉమ్మడి జిల్లా పోలీసులు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వైకాపా ఎమ్మెల్యేలు అడిగిందే తడవు రౌడీలను బంధ విముక్తుల్ని చేస్తున్నారు. నిబంధనలు పాటించకుండానే ప్రక్రియను ముగించేస్తున్నారు. ఇలా అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలో కలిపి సుమారు 100 మందికి పైగా రౌడీషీˆట్లు ఎత్తివేసినట్లు విశ్వసనీయ సమాచారం.
తెదేపా నాయకులపై కుట్రలు
వైకాపా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఉమ్మడి జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో తెదేపా నాయకులపై అక్రమంగా రౌడీషీట్లు తెరిచారు. వారిపై పెట్టిన కేసులు కోర్టుల్లో కొట్టివేసినా రౌడీషీˆట్లు అలాగే కొనసాగిస్తున్నారు. దీనికితోడు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తెదేపాలో క్రియాశీలకంగా ఉన్న నాయకులపై కొత్తగా రౌడీషీట్లు తెరవాలని వైకాపా ఎమ్మెల్యేలు డీఎస్పీలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. పోలింగ్ సమయంలో వారందరినీ బైండోవర్ చేయడం ద్వారా ఎన్నికల్లో తమకు కలిసివస్తుందని ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి గ్రామ, మండలస్థాయిలో బలంగా ఉన్న తెదేపా కార్యకర్తలు, నాయకులపై రౌడీషీట్లు తెరిచేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
ఎన్నికల్లో గొడవలు సృష్టించడం కోసమేనా?
రౌడీషీటు మోపబడిన వ్యక్తులపై ఎన్నికల సమయంలో ప్రత్యేక నిఘా ఉంటుంది. చాలావరకు రౌడీషీటర్లను పోలింగ్ తేదీకి ముందు బైండోవర్ చేస్తారు. వారిని పోలింగ్ ఏజెంటుగా నియమించరు. దీంతో ఎన్నికల సమయంలో అరాచకాలు సృష్టించేందుకు ఈ రౌడీషీట్లు అడ్డంకిగా మారాతాయని వైకాపా నాయకులు భావిస్తున్నారు. కొందరు ఆరాచకశక్తులను బంధ విముక్తి చేసి వారి ద్వారా గొడవలు సృష్టించాలనే కుట్రకు తెరతీసినట్లు సమాచారం. ప్రభుత్వ పెద్దల వరకు విషయాన్ని తీసుకెళ్లి పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. పైస్థాయి ఆదేశాల మేరకు రెండు జిల్లాల్లోని వైకాపా నాయకులపై రౌడీషీట్లు తొలగించినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇందులో కొందరు కరుడుగట్టిన నేరస్థులు కూడా ఉన్నట్లు సమాచారం. అందుకే రౌడీషీట్లు తొలగించిన వారి పేర్లను పోలీసులు బయటపెట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
source : eenadu.net
Discussion about this post