పుట్టపర్తి నియోజకవర్గంలో ఈ నెల 22 నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నట్లు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రకటించారు. అందుకు నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సోమవారం పుట్టపర్తిలోని తెదేపా కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశానికి పల్లె అధ్యక్షతన వహించి మాట్లాడారు. కొందరు కొత్త వ్యక్తులు తమకే టికెట్టు వస్తుందని ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని, పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ఈ నెల 22 నుంచి నిర్వహించే ప్రచారంలో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ‘రానున్న సార్వత్రిక ఎన్నికలు ప్రతిష్ఠాత్మకమైనవి. నాయకులు, కార్యకర్తలు విభేదాలు వీడి సమష్టిగా పనిచేయాలి’ అని అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా, ఏపీ అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యతక ఎంతైన ఉందన్నారు. నాలుగున్నరేళ్లు వైకాపా పాలనలో అభివృద్ధిని గాలికి వదిలేసి, అవినీతి, అక్రమాలు, భూకబ్జాలు ధ్యేయంగా పాలన సాగించారని విమర్శించారు. పుట్టపర్తిలో చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి ఆపద వచ్చినా అండగా ఉంటానన్నారు.
source : eenadu.net
Discussion about this post