అనంతపురం జిల్లాలోని రాప్తాడులో సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ గత తెలుగుదేశం ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అభివృద్ధి విషయంలో ఆరోపణలు చేశారు. ఈ విషయంలో జగన్ ఆరోపణలపై చంద్రబాబు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. అభివృద్ది పాలన ఎవరిదో….విధ్వంసం ఎవరిదో సీఎం జగన్ రెడ్డితో చర్చించేందుకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. ఆదివారం నాడు ఎక్స్(ట్విట్టర్) వేదికగా వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తనవి బూటకపు ప్రసంగాలు కాదని.. దమ్ముంటే తనతో బహిరంగ చర్చకు జగన్ సిద్ధమా అన్నారు.
ఎవరి పాలన స్వర్ణయుగమో…ఎవరి పాలన రాతి యుగమో తేల్చేద్దాం? చర్చకు వచ్చే దమ్ముందా అని చెప్పారు. జగన్ సిద్ధం అని సభలు పెట్టి…అశుద్దం మాటలు చెపుతున్నారని విరుచుకుపడ్డారు. 2019లో ప్రజలు ఇచ్చిన ఒక్క చాన్సే జగన్‌కు రాజకీయంగా చివరి చాన్స్ అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాను రెక్కలు విరిచేయడానికి జనం కసితో సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఓటమి భయంతో బదిలీలు అంటూ 77 మందిని జగన్ మడతపెట్టారని…మిగిలిన నేతలను 50 రోజుల్లో ఇక జనం మడత పెడతారని ఎద్దేవా చేశారు. రూ.10 ఇచ్చి రూ.100 దోచిన జగన్ సంక్షేమ గురించి చెప్పడమా అని దెప్పి పొడిచారు. రాష్ట్రంలో ఏ మూల చూసినా అభివృద్ది లేదని.. ఏ ఊరుకెళ్లినా జగన్ ఐదేళ్ల పాలనా విధ్వంసం కనిపిస్తోందని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
source : andhrajyothi.com
Discussion about this post