‘నీ చరిత్ర ఏంటో, నా చరిత్ర ఏంటో చర్చించేందుకు నేను సిద్ధంగా ఉన్నా.. నీవు ఓపెన్ ఛాలెంజ్‌కు సిద్ధమా’.. అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకి చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి సవాల్ విసిరారు. పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లులో శనివారం జరిగిన బహిరంగసభలో చంద్రబాబు తనను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఒంగోలులోని తన నివాసంలో ఆదివారం కరణం మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
నన్ను దుర్మార్గుడు అన్న చంద్రబాబు కన్నా లోకంలో ఎవరైనా దుర్మార్గులు ఉంటారా? 2019 ఎన్నికల్లో నేను చీరాల టికెట్ అడగలేదు. నిన్ను, నీ కొడుకుని దూషించారంటూ వారిపై కోపంతో దుగ్థ తీర్చుకునేందుకు బలవంతంగా నన్ను చీరాల పంపిన విషయం మర్చిపోవద్దు. గతాన్ని మరిచి మాట్లాడొద్దు. 1975లో నేను ప్రకాశం జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు నువ్వు ఒక తాలూకా అధ్యక్షుడివి. అప్పట్లో ఢిల్లీ వెళ్లి నీకు మంత్రి పదవికి సిఫార్సు చేసింది నేను.
అది మరిచి నాపై విమర్శలు చేస్తే నీ జీవితం మొత్తం బయటపెట్టాల్సి వస్తుంది. నేను చీరాలకు వెళ్లినా గెలిచానంటే అక్కడి స్థానిక పరిస్థితుల దృష్ట్యా పార్టీలకు అతీతంగా ప్రజలు నాకు బ్రహ్మరథం పట్టారు. అంతేతప్ప చంద్రబాబు శక్తివల్ల కాదు. చంద్రబాబుకే గెలిపించే సత్తా ఉంటే ఆయన కొడుకు లోకేశ్‌ను మంగళగిరిలో ఎందుకు గెలిపించుకోలేకపోయాడు. నేను గెలిచి నీ పార్టీలోకి వస్తానని చెప్పినట్లు గలీజు మాటలు మాట్లాడితే సహించను.
source : sakshi.com
Discussion about this post