రాష్ట్రంలో అధికార వైకాపా, ప్రతిపక్ష తెదేపాలు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దిల్లీలో తాకట్టు పెడితే సహించేదిలేదని.. రాష్ట్ర ప్రజలు క్షమించరని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఆయన శనివారం కర్నూలులో మాట్లాడారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం పెంచేలా గతంలో నాయకులు ఎదురుండి పోరాడారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా పోరాడే పార్టీలన్నీ ఏకం కావాలని కోరుతూ 20వ తేదీన విజయవాడలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో కలిసి సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని ముందుకెళతామని చెప్పారు. ఫిబ్రవరి 20న నిర్వహించే సదస్సుతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కోసం పోరాడే శక్తులు, వ్యక్తులు ఉన్నారని ప్రజలకు తెలుస్తుందన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిగా ప్రకటించిన సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి ఆమోదించారని.. ఆయన అధికారం చేపట్టాక మూడు రాజధానులు అంటూ కొత్తపాట పాడారని రామకృష్ణ ధ్వజమెత్తారు. ఇంతటి మోసపూరితమైన ముఖ్యమంత్రి చరిత్రలో లేడన్నారు. ప్రస్తుతం ఆ పార్టీ నాయకులు హైదరాబాద్ రాజధాని కావాలనడం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పని సమాప్తమైందని.. పరిపాలనకు ఆయన అనర్హుడని రాష్ట్ర ప్రజలకు అర్థమైందని చెప్పారు.
source : eenadu.net










Discussion about this post