కులవృత్తులను నమ్ముకుని బతుకు బండిని లాగే పేదలపై ముఖ్యమంత్రి జగన్ పగపట్టినట్టు వ్యవహరిస్తున్నారు. గద్దెనెక్కిన నాటి నుంచి కుల వృత్తుల స్వయం ఉపాధికి ఏ మాత్రం అదరవు ఇవ్వకుండా కుంగదీసిన ఆయన.. చివరికి వారికి సామాజిక భద్రత పింఛన్లూ దక్కకుండా చేస్తున్నారు. ‘నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ’ అంటూనే వారికి ఎసరు పెడుతున్నారు. కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా సంతృప్తికర స్థాయిలో పింఛన్లు అందిస్తున్నామని ప్రగల్భాలు పలుకుతూ తెర వెనుక కుతంత్రాలు అమలు చేస్తున్నారు. కొత్త పింఛన్ల సంఖ్య పెరగకుండా జిత్తులమారి ఎత్తులు వేస్తున్నారు. కుల వృత్తి ఆధారంగా ఇచ్చే పింఛన్ల కోసం గతేడాది ఆగస్టు- డిసెంబర్ మధ్య దరఖాస్తు చేసుకున్న బీసీ, ఎస్సీ వర్గాలకు చెందిన మత్స్యకారులు, కల్లు గీత కార్మికులు, డప్పు కళాకారులు, చర్మకారులు, చేనేత కార్మికులకు పింఛన్లు మంజూరు చేయకుండా మొండిచేయి చూపారు. కొన్నివేల మంది పేదల దరఖాస్తులను బీసీ, ఎస్సీ సంక్షేమశాఖలకు తిప్పి పంపారు.
బడుగులంటే అంత చులకనా?
కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చేనేతలు, డప్పుకళాకారులకు 50 ఏళ్లకు, చర్మకారులకు 40 ఏళ్లకు పింఛను ఇవ్వాలి. కులవృత్తులు అంతరించిపోతుండటం, వారికి తలెత్తే ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుని ఆయా వర్గాల వారికి ఆదరువు ఉండేలా గత ప్రభుత్వాలు మానవతా దృక్పథంతో ఆలోచించి తక్కువ వయసుకే పింఛను మంజూరు చేశాయి. కానీ జగన్‌కు ఎన్నికల్లో ఓట్లు వేసేందుకే బడుగు, బలహీనవర్గాలు కావాలి. చేయూత ఇవ్వాల్సిన సమయంలో చేతులెత్తేస్తారు కదా! ఇప్పుడు పింఛన్ల విషయంలోనూ అదే చేశారు. కులవృత్తులు చేస్తున్న పేదలు ప్రభుత్వ నిబంధనల మేరకు ధ్రువపత్రాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో సమర్పించారు. క్షేత్రస్థాయిలో సచివాలయ సిబ్బంది అన్ని రకాలుగా పరిశీలించి, వారు అర్హులని ప్రభుత్వానికి నివేదించారు. ఇదంతా ఆగస్టు నుంచి డిసెంబర్ నెలాఖరులోపే జరిగింది. కానీ జనవరి 1న కొత్తగా మంజూరు చేసిన పింఛన్లలో వారి పేర్లు లేకుండా జగన్ మాయ చేశారు.
కలెక్టర్ నివేదించినా.. ఫలితం సున్నా
చేనేత పింఛన్లకు ఇప్పుడున్న ఆరు దశల నిబంధనలకు అదనంగా రెండేళ్లపాటు జీఎస్టీ చెల్లింపులు, ఆన్‌లైన్ వేతనాల వివరాలు సమర్పించాలని రెండు కొత్త నిబంధనలు తెచ్చారు. దీంతో వేల సంఖ్యలో చేనేత కార్మికులకు పింఛన్ అందని పరిస్థితి నెలకొంది. ఈ నిబంధనల నుంచి మినహాయింపు కోరుతూ ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా వైయస్‌ఆర్ కలెక్టర్ ప్రభుత్వానికి నివేదించినా ఫలితం లేనట్టు తెలిసింది. ప్రస్తుతానికి కొత్త దరఖాస్తుదారులకే ఈ నిబంధనలను పరిమితం చేశారు. కొన్నేళ్ల నుంచి చేనేత పింఛన్లు తీసుకుంటున్న వారి నుంచి కూడా జీఎస్టీ, ఆన్‌లైన్‌లో వేతనాల చెల్లింపు వివరాలు సేకరించబోతున్నారని ఆ శాఖలో చర్చ నడుస్తోంది. ఇదే తరహాలో మిగతా వర్గాలకూ ఎక్కడ లేని నిబంధనలు తెచ్చి పింఛను ఎగ్గొట్టేందుకు వైకాపా ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆయా సంఘాల నేతలు మండిపడుతున్నారు.
దివ్యాంగుల పింఛన్లపైనా గురి
దివ్యాంగుల పింఛన్‌దారులపైనా జగన్ గురిపెట్టారు. ఇప్పటికే వైయస్‌ఆర్, గుంటూరు జిల్లాల్లో ఏరివేతకు సన్నాహాలు మొదలుపెట్టారు. గ్రామ, వార్డు వాలంటీర్లు 10-15 ఏళ్ల నుంచి ఈ పింఛను తీసుకుంటున్న వారి ఇళ్లకు వెళ్లి.. దివ్యాంగ పింఛనుదారు ఐడీ నంబర్, సదరం సర్టిఫికెట్ ఏ జిల్లా నుంచి తీసుకున్నారు? వైకల్య శాతం ఎంత?దాన్ని ధ్రువీకరించిన వైద్యాధికారి ఎవరు తదితర వివరాలు సేకరిస్తున్నారు. దీంతో లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మిగతా జిల్లాల్లోనూ త్వరలో ఈ ప్రక్రియను చేపట్టనున్నట్టు తెలిసింది.
source : eenadu.net
Discussion about this post