దళిత ద్రోహి సీఎం జగన్ దుర్మార్గపాలనను అంతమొందించేందుకు దళితులంతా సంఘటితంగా పనిచేయాలని మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు పిలుపు నిచ్చారు. ముందుగా తెదేపా ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజుతో కలిసి ఆయన మొలకాల్మూర్ రోడ్డులోని అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలవేసి నివాళి అర్పించారు. అనంతరం నియోజకవర్గంలోని దళిత నాయకులు, కార్యకర్తలు కె.బి.ప్యాలెస్ రోడ్డులో గల షాదీమహల్ వరకు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన దళిత గర్జన సభలో కాలవ మాట్లాడుతూ జగన్ నిరంకుశపాలనలో విధ్వంసాలు తప్పా అభివృద్ధి లేదని, లక్షలాది మంది దళితులపై ఎన్నో దాడులు జరిగాయన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్‌ను ఘోరంగా ఓడిస్తేనే అంబేడ్కర్ రాజ్యాంగ ధర్మాలు, విలువలను రక్షించుకోగలమని పేర్కొన్నారు. తెదేపా హయాంలో ప్రవేశపెట్టిన 27 దళిత సంక్షేమ పథకాలను అన్యాయంగా వైకాపా ప్రభుత్వం రద్దు చేసిందని వెల్లడించారు. తెదేపా ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు మాట్లాడుతూ దళితులు రాజకీయ చైతన్యవంతులై జగన్‌ను ఓటు అనే ఆయుధంతో సాగనం పాలన్నారు. దళితులంటే జగన్‌కు చిన్నచూపని, రూ.30 వేల కోట్ల దళితుల నిధులను ఇతర పథకాలకు మళ్లించాడని చెప్పారు. వైకాపా పాలనలో రాష్ట్రంలో 600 మంది దళితులను హత్య చేశారని, 9 వేల మందిపై దాడులు జరిగాయని వివరించారు. దళితుల అభివృద్ధి, ఆత్మగౌరవం తెదేపాతోనే సాధ్యమన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని 1,129 దళిత కుటుంబాలు తెదేపాలో చేరాయి. జనసేన నియోజకవర్గం అధ్యక్షుడు మంజునాథగౌడ్ మాట్లాడారు.
source : eenadu.net
Discussion about this post