ప్రతిపక్షాలను తాము చెప్పినట్లుగా తిట్టకపోతే తీసేయడమే! వైకాపాలో ఇప్పుడిదే ట్రెండ్!! తాజాగా కందుకూరు సీనియర్ ఎమ్మెల్యే మానుగుండ మహీధర్‌రెడ్డి పైనా ఇదే కారణంతో వేటు వేశారు. కందుకూరు వైకాపా సమన్వయకర్తగా అరవిందా యాదవ్‌కు అప్పగిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించేశారు. ఈ నెల 8న డాక్టర్ పెంచలయ్య సీఎం జగన్ సమక్షంలో వైకాపాలో చేరారు. ఆయన కుమార్తె అరవిందా యాదవ్‌కు కందుకూరు అప్పగించారు. మాజీమంత్రి, సీనియర్ ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డిని పక్కన పెట్టేశారు. ‘ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లను ప్రెస్‌మీట్లు పెట్టి తిట్టాలి. వారి వ్యక్తిత్వాలపై నీచంగా మాట్లాడాలి’ అని వైకాపా ముఖ్య నేతలు ఇటీవల మహీధర్‌రెడ్డికి చెప్పారు. ఆయన సమ్మతించలేదు. ‘స్వతంత్రంగా పోటీ చేసి కూడా గెలిచిన చరిత్ర ఉన్న కుటుంబం మాది. వ్యక్తిత్వాన్ని పక్కన పెట్టి ప్రతిపక్షాల వారిని తిట్టమంటే నా వల్ల కాదు. టికెట్ కోసం వెంపర్లాడే వ్యక్తిని కాను’ అని వారికి ఆయన గట్టిగానే సమాధానం చెప్పి పంపారు.
అప్పటి నుంచి కందుకూరులో మహీధర్‌రెడ్డిని మార్చబోతున్నారంటూ ప్రచారం మొదలైంది. ప్రకాశం జిల్లాకు చెందిన రామారావు అనే నాయకుడిని సీఎం పిలిపించుకుని మాట్లాడారు. ఆయనను కందుకూరుకు పంపనున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. తర్వాత కనిగిరి సిటింగ్ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్‌కు అక్కడ టికెట్ లేకుండా చేసినపుడు.. ప్రత్యామ్నాయంగా ఆయన్ను కందుకూరుకు మారుస్తారనే మాట వినిపించింది. వారంరోజుల కింద పెంచలయ్యను పార్టీలో చేర్చుకుని ఆయన కుమార్తెను ఇప్పుడు కందుకూరు సమన్వయకర్తగా నియమించారు. ఇవన్నీ జరుగుతుండగానే గత నెలలో మహీధర్‌రెడ్డిని సీఎం ఒకసారి పిలిపించుకుని మాట్లాడారు. ‘మీ ఇష్టం.. మీరు ఏ నిర్ణయమైనా తీసుకోండి’ అని మహీధర్‌రెడ్డి సీఎంకు స్పష్టం చేశారని వార్తలొచ్చాయి.
source : eendu.net
Discussion about this post