దేశంలో మరెక్కడా లేనన్ని సంక్షేమ పథకాలు కేవలం ఏపీలోనే అమలవుతున్నాయని, ఆ సంక్షేమ ఫలాలు మరోసారి పేదలకు దక్కాలంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంతర్జాతీయ సువార్త ప్రసంగీకురాలు, దివంగత వైస్ రాజశేఖరరెడ్డి సోదరి వైఎస్ విమలారెడ్డి అన్నారు. జిల్లా పాస్టర్ల సంఘం ఆధ్వర్యంలో అనంతపురంలోని గుత్తి రోడ్డులో ఉన్న ఓ ఫంక్షన్ హాల్ వేదికగా గురువారం పాస్టర్ల సదస్సు నిర్వహించారు. పాస్టర్ల సంఘం అధ్యక్షుడు నెహమ్యానాగరాజు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి వైఎస్ విమలారెడ్డితో పాటు అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు (క్రిస్టియన్ అడ్వైజర్) బాలాస్వామి, ఏపీ క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ జాన్‌వెస్లీ, సీఎస్‌ఐ చర్చి పాస్టర్ రెవరెండ్ బెన్‌హర్‌బాబు, తదితరులు ఆత్మీయ అతిథులుగా విచ్చేసి మాట్లాడారు. క్రైస్తవులందరూ మళ్లీ ఐక్యమత్యంతో సుభిక్షమైన పాలనను తెచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిపక్షాల కుట్రలను, కుతంత్రాలను తరిమికొట్టేలా సామాన్యులను చైతన్యవంతం చేసే శక్తి పాస్టర్లకే ఉందన్నారు. సంక్షేమం అంది ఉంటేనే ఓటు వేయండి, ప్రతి ఇంటికీ మంచి జరిగితేనే ఆశీర్వదించండని ఇంత ధైర్యంగా చెప్పే ముఖ్యమంత్రి దేశంలోనే లేరన్నారు. గత టీడీపీ పాలనలో క్రైస్తవులు పడిన పాట్లను గుర్తు చేశారు. కేవలం జగన్ పాలనలో మాత్రమే పాస్టర్లకు గౌరవవేతనం అందుతోందన్నారు. క్రైస్తవులకు సమస్యలేమున్నా చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ముందుకొస్తుందన్నారు. దివంగత వైఎస్సార్ హయాంలో ప్రారంభమైన క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆయన తర్వాత నిస్సారంగా మారిందని మళ్లీ జగన్ మాత్రమే క్రైస్తవులను గుర్తిస్తున్నారన్నారు. పాస్టర్లు సుధాకరబాబు, మనుష్యే, ఏషయ, విజయ్, జాన్, ఆనంద్, ప్రభాకరరెడ్డి, ఫిలఫ్, కన్వీనర్ ఎన్‌ఆర్ బాబు, మోజెస్, సునీల్, సిస్టర్ విజయకుమారి ప్రసంగించారు. అంతకు ముందు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని సామూహిక ప్రార్థనలు జరిగాయి.
source : sakshi.com
Discussion about this post