అబద్ధమాడినా.. అతికినట్లు ఉండాలి అంటారు. జగన్ ప్రభుత్వం అడ్డగోలుగా పచ్చి అబద్ధాలు చెబుతోంది. హైకోర్టుకూ ఇలాగే చెప్పింది. నదుల్లో ఇసుక అక్రమ తవ్వకాల్లేవని.. నిల్వ కేంద్రాల్లో ఇసుకనే విక్రయిస్తున్నట్లు చెప్పేందుకు ప్రయత్నించింది. కళ్లముందు అక్రమాలన్నీ స్పష్టంగా కనిపిస్తున్నా.. మొండివాదనే వినిపిస్తోంది. రాష్ట్రప్రభుత్వ వాదనను హైకోర్టు ఆక్షేపించి, ఇసుక అక్రమ తవ్వకాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టంగా ఆదేశించింది. అయినా గురువారం కూడా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా ఇసుక తవ్వకాలు ఆగలేదు.
నిల్వకేంద్రాల్లో ఉన్న ఇసుక ఎంత?
హైకోర్టు, ఎన్జీటీలో ఇసుక అక్రమ తవ్వకాలపై కేసులు విచారణకు వచ్చిన ప్రతిసారీ.. స్టాక్ పాయింట్లలో ఇసుకనే విక్రయిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. గత ఏడాది ఏప్రిల్ 24 నుంచి రాష్ట్రంలోని 110 రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు ఆపేయాలని రాష్ట్రస్థాయి పర్యావరణ ప్రభావ మదింపుసంస్థ (సియా) గనులశాఖను, అప్పటి ఇసుక గుత్తేదారు జేపీ సంస్థను ఆదేశించింది. అప్పటికే స్టాక్‌పాయింట్లలో ఇసుక ఉంటే.. దాన్నే విక్రయించాలి. రాష్ట్రమంతా కలిపి 50లక్షల టన్నుల ఇసుక ఉన్నట్లు గనులశాఖ అధికారులు అప్పట్లో చెప్పారు. ఇది మూడు, నాలుగు నెలలకే సరిపోతుంది. కానీ రాష్ట్రంలో అనేక నిల్వకేంద్రాల్లో ఇసుక నిల్వలు అలాగే ఉన్నాయి. నదుల్లో అక్రమంగా తవ్వి విక్రయిస్తున్నారు. పేరుకు నిల్వకేంద్రాల నుంచి విక్రయిస్తున్నట్లు వే బిల్లులు జారీచేస్తున్నారు. గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు దాదాపు 2 కోట్ల టన్నుల ఇసుక విక్రయించి ఉంటారు. అదంతా నదుల్లో తవ్వినదే.
source : eenadu.net
Discussion about this post