జనరంజక పాలనతో రాష్ట్రంలోని అన్ని వర్గాలకు మేలు చేసిన జగనన్నను మరోసారి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ప్రజలను కోరారు. బుధవారం మండలంలోని చారుపల్లిలో ఎమ్మెల్యే ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా ఆయన సతీమణి దుద్దుకుంట అపర్ణారెడ్డి, కుటుంబీకులతో కలిసి ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శంఖం పూరించి ఇంటింటా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సీఎం జగనన్న నాయకత్వంలో అమలు చేసిన నవరత్న పథకాలతో ముద్రించిన కరపత్రాలను ఓటర్లకు అందించారు.
2019 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను వందశాతం నెరవేర్చిన ఘనత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల ఉత్తమ భవిష్యత్ కోసం ‘నాడు–నేడు’ కింద రూ.67 వేల కోట్లు ఖర్చుచేసి కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది పేద పిల్లలు సైతం ఇంగ్లిష్ విద్యను అభ్యసించేలా చర్యలు చేపట్టారన్నారు.
రైతులు, కార్మికులు, వృద్ధులు, అక్కచెల్లెమ్మలు, ఇలా అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో కృషి చేశారని ఎమ్మెల్యే అన్నారు. అందువల్లే అన్ని వర్గాల ప్రజలు మరోసారి ఆయన్ను ముఖ్యమంత్రిని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమమే వైఎస్సార్ సీపీ విజయ సోపానాలని, త్వరలో జరిగే ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ అఖండ మెజార్టీ సాధించి వైఎస్ జగన్ రెండోసారి సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జగనన్న సహకారంతో పుట్టపర్తి నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనంతగా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఎమ్మెల్యే గుర్తు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం కొనసాగుతుందన్నారు. గ్రామంలో ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డికి వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే సతీమణి దుద్దుకుంట అపర్ణారెడ్డి ముందుండి ప్రచారాన్ని కొనసాగించారు. గడప గడపలోనూ ఆమెకు మహిళలు హారతులు పట్టి, తిలకం దిద్ది మద్దతు పలికారు.
source : sakshi.com
Discussion about this post