నమ్మకద్రోహం, వెన్నుపోట్లకు పేటెంట్‌దారుడైన చంద్రబాబు జనసేనకు సీట్ల కేటాయింపులో వ్యూహం మార్చారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎన్నిసీట్లు విసిరేసినా మహద్భాగ్యంగా స్వీకరించడానికి జనసేనఅధినేత పవన్ కళ్యాణ్ సంసిద్ధంగా ఉన్నా, ఆ పార్టీలోని ఆశావహులు, హరిరామజోగయ్య లాంటి సామాజిక పెద్దలు ససేమిరా అంటున్నారనేందుకు వారి నిత్యాభిప్రాయాలే నిదర్శనం. సీఎం పదవిలో పవన్ షేర్ దక్కించుకోవాలంటే అందుకు తగిన సంఖ్యలో పొత్తులో సీట్లు పొందాల్సిందేనని పట్టు పడుతున్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం.. పొత్తు ధర్మం కోసం.. అనే ‘ప్యాక్డ్’ పదాలను పక్కన పెట్టాల్సిందేనని పవన్‌కు స్పష్టం చేస్తున్నారు.
తమకు ప్రధాన పట్టు ఇక్కడేనని భావిస్తూ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో మెజార్టీ సీట్లను డిమాండ్ చేస్తున్న పవన్ బృందాన్ని ఆ జిల్లాల్లోనే దెబ్బ తీయాలనేది బాబు తాజా ప్రణాళికగా తెలుస్తోంది. ఇందుకుగాను పక్కా వ్యూహంతో కొణిదెల ఫ్యామిలీ రాజకీయ ఓటములను తెరపైకి తీసుకొస్తున్నారనేది సమాచారం. ఇందులో భాగంగా ‘ఆ నలుగురూ కుటుంబ సభ్యులే.
అందులో ముగ్గురు స్వయానా అన్నదమ్ములే. అయిదు చోట్ల పోటీ చేయగా గెలిచింది ఒక్క చోటే. ఒకేఒక్కడు. తక్కిన ఇద్దరిదీ మూడో స్థానమే. ఈ విషయాన్నే విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి’ అనే సూచనలు టీడీపీ అధిష్టానం నుంచి ఆ పార్టీ ముఖ్యులకు చేరాయి. ప్రధానంగా టికెట్లు ఎక్కువగా ఆశిస్తున్న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో చాప కింద నీరులా ప్రచారం కొనసాగించే బాధ్యతలను తన నమ్మకస్తులకు బాబు అప్పగించారనేది విశ్వసనీయ సమాచారం.
ఆ ముగ్గురికీ తప్పని ఘోర పరాజయం
ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన కొణిదెల చిరంజీవి 2009 ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేసి, తిరుపతిలో మాత్రమే గెలుపొందారు. పాలకొల్లు నుంచి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి ఉషారాణి చేతిలో 5,446 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
♦ జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి పోటీపడి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ చేతిలో 8,357 ఓట్లతో ఓడిపోయారు. గాజువాక నుంచి కూడా బరిలోకి దిగిన పవన్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నాగిరెడ్డి చేతిలో 16,753 ఓట్ల తేడాతో ఘోర పరాజయం చవిచూశారు.
♦ వీరిద్దరికీ స్వయానా సోదరుడైన కె.నాగబాబు 2019 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి మూడవ స్థానంలో నిలిచారు. ప్రస్తుతం జనసేనలో క్రియాశీలకంగా ఉంటూ రాజకీయ వ్యవహారాలను చక్కదిద్దే పనిలో జిల్లాల పర్యటనల్లో నిమగ్నమయ్యారు.
♦ ప్రజారాజ్యం పార్టీలో అత్యంత కీలక వ్యక్తిగా చలామణి అయిన, చిరంజీవికి స్వయానా బావ అయిన అల్లు అరవింద్ 2009 ఎన్నికల్లో అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి, మూడో స్థానానికే పరిమితమైన సంగతి తెలిసిందే.
source : sakshi.com
Discussion about this post