బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లులో తెదేపా అధినేత చంద్రబాబు తలపెట్టిన రా..కదలిరా సభను అడ్డుకునేందుకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. బుధవారం ఉదయం సభ నిర్వహణ పనులను ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రారంభించారు. రాత్రి సమయంలో పోలీసులు సభాస్థలికి వచ్చి దేవాదాయశాఖ భూమిలో సభ నిర్వహిస్తున్నారని ఫిర్యాదు వచ్చినందున పనులు నిలిపేయాలని ఆదేశించారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారుల నుంచి వివరణ కోరేందుకు పార్టీ నేతలు ప్రయత్నించినా అధికారులు స్పందించలేదు. ఇంకొల్లు-పావులూరు రహదారి పక్కన 30 ఎకరాల విస్తీర్ణంలో సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో 19 ఎకరాలు దేవాదాయశాఖ భూమి ఉంది. మిగిలిన భూమి ప్రైవేటుది. వారంతా అంగీకారం తెలిపారు. దేవాదాయశాఖ భూమి 13 ఎకరాలను కౌలుకు సాగు చేసుకుంటున్న రైతు సభ నిర్వహణకు అంగీకారం తెలపడంతో ఆ స్థలంలో పనులు ప్రారంభించారు. సభకు అనుమతి కోసం ఉన్నతాధికారులకు దరఖాస్తు చేశారు. లక్ష మందికి పైగా తరలివస్తారని తెదేపా వర్గాలు అంచనా వేస్తున్నాయి. సభ విజయవంతమైతే తమ ఉనికికి ప్రమాదమనే భయంతో అధికార పార్టీ ఆటంకాలు కలిగిస్తోందని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. ఏర్పాట్లు పూర్తయిన తర్వాత సభను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
source : eenadu.net










Discussion about this post