‘తెదేపా హయాంలో రాష్ట్రం ఎంతో ప్రగతి సాధించింది. వైకాపా అధికారంలోకి వచ్చాక అవినీతితో అభివృద్ధి అడుగంటిపోయింది. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎంత అవినీతికి పాల్పడ్డారో అందరికీ తెలుసు’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్ విరుచుకుపడ్డారు. ‘కావాలంటే సమయాన్ని నిర్ణయించండి. ఆధారాలతో సహా నిరూపిస్తా’ అని ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు. పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి నియోజకవర్గాల్లో బుధవారం జరిగిన శంఖారావం సభల్లో ఆయన మాట్లాడారు. తెదేపా, జనసేన నేతలు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం డయేరియా విజృంభిస్తోందని, కనీసం సమీక్షించే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదని లోకేశ్ మండిపడ్డారు. ఇటీవల గుంటూరులో ఇద్దరు మరణించారని, వందలమంది ఆసుపత్రుల పాలయ్యారని అన్నారు.
పరిశ్రమలు తీసుకొస్తాం. .
గతంలో తాను చంద్రబాబు తులసివనంలో పెరిగిన మొక్కనని చెప్పుకొన్న ఆరోగ్య మంత్రి విడదల రజని.. ఇప్పుడు గంజాయి మొక్కలా ఎలా మారారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు బీసీలు తమకు వెన్నెముక అన్న జగన్.. అధికారంలోకి వచ్చాక అన్ని విధాలుగా వారిని అణచివేశారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక బీసీలకు అండగా ఉంటామన్నారు. విజయనగరంతో పాటు అన్ని జిల్లాల్లో క్యాన్సర్ ఆసుపత్రులు కడతామని హామీ ఇచ్చారు. అవసరమైతే బసవతారకం ట్రస్టు ద్వారా నెలకొల్పుతామన్నారు. తనకు తోబుట్టువులు లేరని, కార్యకర్తలే తోబుట్టువులని తెలిపారు. అనంతపురంలో ఉన్న కియా కార్ల తయారీ పరిశ్రమ తరహాలో విశాఖకు పెద్ద పరిశ్రమలు తీసుకొచ్చి, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భరోసానిచ్చారు.
అన్నీ అమలు చేస్తాం..
‘జగన్ ఆపేసిన పథకాలన్నీ తెదేపా వచ్చిన తర్వాత మళ్లీ అమల్లోకి తెస్తాం. వాటికి అదనంగా సూపర్- 6 కార్యక్రమాల్ని అమలు చేస్తాం. 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తామని నమ్మించారు. కానీ ఏమీ చేయలేకపోయారు. వైకాపా ఎంపీలు తలో రకంగా ఉన్నారు. ఒకరు అసభ్యకరంగా ప్రవర్తిస్తే, మరొకరు సీబీఐ వస్తే ఆసుపత్రిలో దాక్కుంటారు. ఇంకొకరు రీల్స్ చూసుకుంటారు. ఓ ఎంపీ విశాఖలో తన కుటుంబానికి రక్షణ లేదని హైదరాబాద్ వెళ్లిపోయారు. మరో వ్యక్తి జగన్‌తో పాటు వాటాలు పంచుకుంటున్నారని’ ఆరోపించారు.
source : eenadu.net
Discussion about this post