పాదయాత్ర సమయంలో చిట్టూరు, తరిమెల గ్రామాల ప్రజలకు ఇచ్చిన మాటను అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలబెట్టుకున్నారని అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తెలిపారు. చిట్టూరు వద్ద పెన్నానదిపై నిర్మించిన నూతన బ్రిడ్జిని వారు మంగళవారం ప్రారంభించారు. ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ పాదయాత్ర సమయంలో పై రెండు గ్రామాల ప్రజలు రాకపోకలకు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారని చెప్పారు. వర్షాకాలంలో నదిలోంచి నడుచుకుంటూ అవతలికి వెళ్లాల్సి వస్తోందని ప్రజలు తెలియజేశారన్నారు. సీఎం అయ్యాక ఉన్నతాధికారులతో మాట్లాడి పెన్నానదిపై లోలెవల్ పైపు కల్వర్టు నిర్మించడానికి చర్యలు చేపట్టారన్నారు. ఇందుకు రూ.3.50 కోట్ల నిధులు మంజూరు చేశారని తెలిపారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యి వినియోగంలోకి రావడంతో చిట్టూరు, నాగలాపురం, చిత్రచేడు, గోపురాజుపల్లి, రాంపురం తదితర గ్రామాల ప్రజలకు అత్యవసర సమయంలో అనంతపురం వెళ్లడానికి మార్గం సుగమమైందన్నారు. ప్రజల కష్టాలను తీర్చి.. సంక్షేమ ఫలాలను అందిస్తున్న వైఎస్సార్‌సీపీని మరోసారి అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయడంలో పంచాయతీరాజ్ ఎస్‌ఈ భాగ్యరాజ్, ఈఈ కొండయ్య, డీఈ రజనీకాంతరెడ్డి, ఏఈ సురేష్‌రెడ్డి ఎంతో కృషి చేశారని కొనియాడారు. అనంతరం చిట్టూరు – తరిమెలకు పెన్నానదిపై బ్రిడ్జికి అటు వైపున, ఇటు వైపున రూ.5 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు సంబంధించి శిలాఫలకం ఆవిష్కరించారు.
source : sakshi.com
Discussion about this post