అధైర్యపడొద్దని.. అన్ని విధాలుగా బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి భరోసా కల్పించారు. ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆమె పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాల్లో పర్యటించారు. భువనేశ్వరికి మహిళలు, అభిమానులు అడుగు అడుగడుగునా పల్లె, పల్లెనా పూలతో పెద్దఎత్తున ఘన స్వాగతం పలికారు. నిర్దేశిత సమయం కంటే గంట ఆలస్యంగా వచ్చినప్పటికీ ఉత్సాహంగా ఎదురుచూశారు. చంద్రబాబు జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొని ఆందోళనకు గురై మృతి చెందిన కుటుంబాలను ఆమె పరామర్శించారు. తెదేపా అన్ని విధాలుగా అండగా ఉంటుందని బాధిత కుటుంబాలకు ఆమె తెలిపారు. పలువురు మహిళలు, తెదేపా శ్రేణులు జై చంద్రబాబు, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని నినాదాలు చేశారు.
చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుతో మనస్తాపానికి గురై ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. వీరికి రూ.3 లక్షలు చొప్పున ఆర్థిక సాయాన్ని చెక్కుల రూపంలో అందించారు. పుట్టపర్తి మండలం నిడుమామిడికి చెందిన మునిమడుగు బావయ్య, ఓబుళదేవరచెరువు మండలం గాజుకుంటపల్లికి చెందిన మేకల రామచంద్ర, కదిరి నియోజకవర్గంలో కదిరి మున్సిపాలిటీ ఎనిమిదో వార్డుకు చెందిన మద్దిగళ్ల ప్రకాశ్, తనకల్లు మండలం కొర్తికోటలోని షేక్ బుడన్ సాహెబ్, కదిరి మండలం ముష్టిపల్లిలోని చంద్రతో పాటు తలుపుల మండల కేంద్రంలోని ఎగువపేటకు చెందిన మహేశ్వర కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించి, ఆర్థిక సాయం చెక్కులను అందజేశారు.
source : eenadu.net
Discussion about this post