రాష్ట్ర ప్రజలు, తెదేపా కార్యకర్తలు చూపే అభిమానమే తమకు రక్ష అని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. ‘న్యాయం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆమె శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటించారు. నాడు తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపానికి గురై పలువురు కార్యకర్తలు, అభిమానులు మరణించారు. బాధిత కుటుంబాలని పరామర్శించేందుకు ఆమె జిల్లాకు వచ్చారు. పుట్టపర్తి నియోజకవర్గంలో రెండు, కదిరి నియోజకవర్గంలో నాలుగు కుటుంబాలను పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున అందజేశారు. ‘ఎవరూ భయపడొద్దు.. మేమున్నాం. భవిష్యత్తులో పార్టీ అండగా ఉంటుంది’ అని ఆమె వారికి భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి 53 రోజులు జైల్లో పెడితే కార్యకర్తలే అండగా నిలిచారన్నారు. కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా అండగా ఉంటామని వివరించారు. ‘ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టినా కలిసి పోరాడదాం.. తెదేపా జెండా రెపరెపలాడిద్దాం’ అని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి, మాజీ మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత, కదిరి నియోజకవర్గ బాధ్యుడు కందికుంట వెంకటప్రసాద్, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, నాయకులు బండారు శ్రావణి, పర్వీన్‌బాను, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కదిరి పట్టణంలో మద్దిగళ్ల ప్రకాశ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన ఆమె పక్కనే ఉన్న బీసీ బాలికల సంక్షేమ వసతి గృహాన్ని సందర్శించారు. హాస్టల్‌లో విద్యార్థినులతో ముచ్చటించారు.
source : eenadu.net
Discussion about this post