ఆంధ్ర యూనివర్సిటీ జూబ్లీ గ్రౌండ్లో జరుగుతున్న ఆడుదాo ఆంధ్ర ..కబడ్డీ పోటీలను మంత్రి రోజా వీక్షించడంతో పాటు కబడ్డీ ఆడారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు పుణ్యమా అని రాష్ట్రానికి ఏమీ లేకుండా పోయిందని.. క్రీడలను ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోయడం.. విమర్శలు చేయడం తప్ప ఇంకేం చేస్తున్నాయని ప్రశ్నించారు. 120 కోట్లు వెచ్చించి ఆడుదాం ఆంధ్రా క్రీడలను వైసీపీ ప్రభుత్వం నిర్వహిస్తోందని రోజా అన్నారు.
చంద్రబాబు రాజకీయ లబ్ది కోసం గతంలో కాంగ్రెస్‌తో, ఇప్పుడు బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకుంటున్నాడని రోజా విమర్శించారు. బాబు, లోకేష్‌ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలు విని విని బోర్ కొట్టడంతో.. వైఎస్ షర్మిలను రంగంలోకి దించారన్నారు. తెలంగాణలో పార్టీ పెట్టి కాంగ్రెస్‌లో విలీనం చేసి.. ఇప్పుడు ఏపీలో టైమ్ పాస్ రాజకీయాలు చేయడానికి వచ్చిందని షర్మిలను రోజా విమర్శించారు. షర్మిల మాట్లాడే ప్రతి మాట కూడా చంద్రబాబు స్క్రిప్ట్ అని విమర్శించారు.
చంద్రబాబు ఇంటికి వెళ్లి పెళ్లి కార్డు ఇచ్చిందని… అలాగే వైఎస్సార్ పంచెలూడదీసి కొడతానన్నా పవన్ కల్యాణ్ ఇంటికి సైతం వెళ్లి పెళ్లికి ఆహ్వానించిందని రోజా దుయ్యబట్టారు. టీడీపీ కోవర్ట్ అయిన రేవంత్ రెడ్డితో ఏ మొహం పెట్టుకొని షర్మిల పొత్తు పెట్టుకుందని ప్రశ్నించారు. వినే వాడు వెర్రి వాడు అయితే చెప్పే వాడు షర్మిల అన్నట్లుగా పరిస్థితి మారిందన్నారు. ఒక్క రాజశేఖర్ రెడ్డి బిడ్డ అనే గుర్తింపు తప్ప.. అసలు షర్మిలకు అసలేం గుర్తింపు ఉందని రోజా ప్రశ్నించారు.
source : andhrajyothi.com
Discussion about this post