హార్సిలీహిల్స్‌లో విలువైన స్థలాన్ని అధికార వైకాపాకు అనుకూలమైన వ్యక్తులకు కేటాయించడంపై అఖిలపక్షం నాయకులు భగ్గుమన్నారు. తక్షణమే చీకటి జోవోను రద్దు చేయాలని డిమాండు చేశారు. మదనపల్లె ఆర్డీవో కార్యాలయం ఎదుట సోమవారం తెదేపా, జనసేన, కాంగ్రెస్, సీపీఐ, ప్రజాసంఘాల నాయకులు ధర్నా నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, తెదేపా మదనపల్లె నియోజకవర్గ బాధ్యుడు దొమ్మలపాటి రమేశ్ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ భూములను అస్మదీయులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. హార్సిలీహిల్స్‌లో భూపంపిణీని అడ్డుకుంటామని, దీనిపై ఎన్ని కేసులు బనాయించినా వెనక్కి తగ్గేదేలేదన్నారు. జనసేనపార్టీ రాయలసీమ కోకన్వీనర్ గంగారపు రాందాస్‌చౌదరి మాట్లాడుతూ హంద్రీనీవా కాలువను పూర్తి చేయలేదని, మదనపల్లెను జిల్లా కేంద్రంగా చేయాలని ఆందోళనలు చేసినా పట్టించుకోని సీఎం జగన్ హార్సిలీహిల్స్‌లో భూమిని ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నించారు. అనంతరం కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
source : eenadu.net
Discussion about this post