రాప్తాడు వేదికగా ముఖ్యమంత్రి సిద్ధం సభకు వస్తున్నారని, అసలు జగన్‌మోహన్‌రెడ్డి దేనికి సిద్ధంగా ఉన్నారో సమాధానం చెప్పాలని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. జయహో బీసీ సదస్సు కార్యక్రమంలో భాగంగా సోమవారం మండల కేంద్రంలో బైకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారా.. లేకుంటే మరోసారి ప్రజలను మోసం చేసేందుకు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. వైకాపా సభలకు జనాన్ని తరలించేందుకు పాఠశాలలకు సెలవులు ప్రకటించడం, ఆర్టీసీ బస్సులు రద్దు చేయడం వంటి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు. సీఎం జగన్ ప్రజలను మోసం చేయడానికి సిద్ధంగా ఉంటే.. తాము కూడా ఆయన అవినీతి, అక్రమాలను బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డతో పాటు ఆయన సోదరులను తరిమికొట్టడానికి రాప్తాడు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. బీసీల ఆత్మగౌరవం కోసమే తెదేపా ఆవిర్భవించిందన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పరిపాలనలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు జైలుకు వెళితే.. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి పాలనలో సీఐ, ఎస్సైలు, అధికారులు సస్పెండ్‌కు గురవుతున్నారన్నారు. ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో లంచాలు లేకుండా పని చేయడం లేదని విమర్శించారు.
source : eenadu.net
Discussion about this post