వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాల డెయిరీలపై కక్ష సాధింపు చర్యకు పాల్పడింది. ఉన్న ఉద్యోగులను తొలగించింది. రెండు డెయిరీలు, 36 పాల శీతలీకరణ కేంద్రాలను పూర్తిగా మూసేసింది. యంత్రాలు, సామగ్రి చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాలకు తరలించారు. అమూల్ సంస్థకు పాలసేకరణ బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఏయే గ్రామాల్లో ఎన్ని పశువులు ఉన్నాయి. ఎంత మంది పాల ఉత్పత్తిదారులు ఉన్నారు. రోజుకు ఎన్ని లీటర్లు పాల సేకరించవచ్చు వంటి అంశాలపై గ్రామాల వారీగా సర్వే చేశారు. ఇదంతా మూడేళ్ల క్రితం మాట. ఇప్పటికీ ఒక్క లీటరు పాలు సేకరించిందేలేదు. మళ్లీ ఇప్పుడు అధికారుల్లో హడావుడి మొదలైంది. పశుసంవర్ధకశాఖ, జిల్లా డెయిరీ అధికారులు గ్రామాల్లో తిరుగుతున్నారు. పాల సేకరణపై అవగాహన సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 14న పాల సేకరణ ప్రారంభించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. దీనిపై ఇప్పుడు అధికారులంతా కుస్తీ పడుతున్నారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో 2020 నాటికి అనంతపురం, హిందూపురంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డెయిరీలు, వాటి కింద 36 పాల శీతలీకరణ కేంద్రాలు ఉన్నాయి. అవన్నీ మూసేశారు. రెండు డెయిరీల పరిధిలో 26 మంది ఉద్యోగులు, సిబ్బంది జీతాలు కూడా ఇవ్వకుండా తొలగించారు. సహకార శాఖకు సంబంధించిన అధికారిని అనంతపురం డెయిరీ ఇన్‌ఛార్జి డీడీగా నియమించారు. ఒక మేనేజర్ విధుల్లో కొనసాగుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 36 పాల శీతలీకరణ కేంద్రాల్లో కొత్తగా యంత్ర సామగ్రిని కొనుగోలు చేసి సరఫరా చేశారు. పాతవి మూసేసి, కొత్తవి నిర్మించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని అధికారులు పేర్కొంటున్నారు.
సర్వేతో సరిపెట్టారు
అమూల్ సంస్థకు 2021లో పాల సేకరణ బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా పశు సంవర్ధకశాఖ కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. పశు సంవర్ధక, డీఆర్‌డీఏ, సహకార శాఖలకు అధికారులను నియమించారు. 8 నెలలపాటు పనిచేశారు. గ్రామస్థాయిలో పశు వైద్యులు, ఇతర సిబ్బంది సర్వే చేశారు. అప్పట్లో మూడు క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. తొలి విడతలో అనంతపురం గ్రామీణం, బుక్కరాయ సముద్రం, నార్పల, ఆత్మకూరు, రాప్తాడు, యల్లనూరు మండలాల పరిధిలో 98 గ్రామాల్లో 96,250 ఇళ్లను సర్వే చేశారు. ఒక్కో గ్రామం నుంచి 160 లీటర్లు చొప్పున రోజుకు 15,680 లీటర్లు పాలు సేకరించాలని నిర్ణయించారు. ఏమైందో తెలియదు. అప్పటితో అది ఆగిపోయింది. తాజాగా యంత్ర సామగ్రినంతా కేంద్రాల్లో సరఫరా చేశారు. 98 గ్రామాలకు సంబంధించి అనంతపురం గ్రామీణంలో రాచానపల్లి, బుక్కరాయ సముద్రం మండలం కొర్రపాడు-2లో పాల శీతలీకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి అమూల్ సంస్థ పాల ఉత్పత్తులను తరలిస్తున్నట్లు అధికార వర్గాల సమాచారం.
source : eenadu.net
Discussion about this post