చర్చిలోకి వైకాపా జెండాలతో వచ్చి హల్‌చల్ చేసిన వైకాపా నాయకులు, కార్యకర్తలను వారించినందుకు.. కక్షగట్టి క్రైస్తవ మత పెద్దలపై దాడులకు పాల్పడ్డారు. పల్నాడు జిల్లా రెంటచింతలతో ఇటీవల ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు వివరాలిలా.. ఈనెల 2న రెంటచింతల కానుకమాత తిరునాళ్లలో భాగంగా ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు వైకాపా జెండాలు పట్టుకుని చర్చిలోకి ప్రవేశించారు.
మందిరంలోకి రాజకీయ జెండాలతో రావొద్దని, ప్రార్థనలు జరిగేచోట రాజకీయాలు చేయొద్దని, వెనక్కు వెళ్లాలని మత పెద్దలు ఇన్నారెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి సూచించారు. దీనిని అవమానంగా భావించిన వైకాపా నాయకులు అదును చూసి ఈనెల 4న మీసేవా కేంద్రంలో ఇన్నారెడ్డి, విజయభాస్కర్‌రెడ్డిలపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మీసేవా కేంద్రంలోని కంప్యూటర్లు ధ్వంసమయ్యాయి. కొంత నగదు, బంగారు గొలుసు చోరీకి గురయ్యాయి. స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేయగా కొందరిపైనే కేసులు నమోదు చేశారు. నిందితులందరిపై కేసు నమోదుచేయాలని కోరుతూ ఆదివారం రెంటచింతలలో క్రైస్తవులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. వైకాపా నేతల చర్యను మతపరమైన దాడిగా పరిగణిస్తున్నామని పేర్కొన్నారు.
source : eenadu.net










Discussion about this post