రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నా టీడీపీ, జనసేన పార్టీల మధ్య సీట్ల సిగపట్లు ఏమాత్రం తగ్గడంలేదు. ఎవరికి వారు సై అంటే సై అంటూ కత్తులు నూరుతున్నారు. రెండు పార్టీల అధినేతలు పొత్తు కుదుర్చుకున్నా కింది స్థాయిలో నేతలు, కేడర్ మనసులు మాత్రం కలవడంలేదు. మున్ముందు కూడా కలిసి పనిచేసేందుకు కేడర్ సంసిద్ధంగాలేని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో రాష్ట్రంలో చాలాచోట్ల రెండు పార్టీల నేతల మధ్య పొత్తు అస్సలు పొసగడంలేదు. పైగా.. కలిసి పనిచేస్తున్నట్లు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు ఎప్పుడో ప్రకటించినా ఇప్పటివరకు ఒక్కడుగు కూడా వారిరువురూ ఆ దిశగా ముందుకు వేయలేదు.
సీట్ల సర్దుబాటు నుంచి ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి సభల వరకు అన్నీ ప్రకటనలకే పరిమితమయ్యాయి. కలిసి పనిచేయడానికి ఇద్దరు నేతలు ఆరాటపడుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఇరు పార్టీల నేతలు కత్తులు దూసుకుంటున్నారు. అలాగే, సీట్ల సర్దుబాటుపై కొన్నినెలలుగా చర్చలు జరగడమే తప్ప ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం వెల్లడించకపోవడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.
మరోవైపు.. తమకు 50కి పైగా సీట్లు కేటాయించాలని జనసేన కోరుతుండగా, 15 సీట్లు ఇవ్వడానికి కూడా బాబు సిద్ధంగాలేరు. ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తామని రెండునెలల క్రితం ప్రకటించినా ఇంతవరకూ ఆ ఊసేలేదు. అంతేకాక.. ఇద్దరు అధినేతలు కలిసి ఉమ్మడిగా సభలు నిర్వహిస్తారని ప్రకటించినా అదీ జరగలేదు. బాబు ‘రా కదలిరా’ సభలకు పవన్ వెళ్తారని ప్రచారం చేసినా ఆయన వెళ్లలేదు. సీట్ల సర్దుబాటు కుదరకపోవడంవల్లే ఏ నిర్ణయం తీసుకోలేక సతమతమవుతున్నారు.
source : sakshi.com
Discussion about this post