టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి మహిళా ద్వేషి అని, ఇటీవల ఆయన తన ప్రసంగాల్లో మహిళా ప్రజాప్రతినిధులపై చేసిన అనుచిత వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి, వైఎస్సార్ సీపీ పెనుకొండ నియోజకవర్గ సమన్వయకర్త ఉషశ్రీచరణ్ అన్నారు. శుక్రవారం ఆమె రొద్దంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మహిళలు రాజకీయంగా ఎదగకూడదన్నదే బీకే పార్థసారథి అభిమతమన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ తనకు టికెట్ ఇస్తుందో లేదో తెలియక ఆ బాధలో అతను మాట్లాడుతున్నట్లు తెలుస్తోందన్నారు. ‘జయహో బీసీ’ అంటూ బీసీలను గురించి మాట్లాడుతున్న బీకే పార్థసారథి…మండలంలో కనీసం ఒక కనకదాసు విగ్రహం కూడా పెట్టలేకపోయారన్నారు. అలాగే 30 ఏళ్లుగా నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేసిందేమీ లేదన్నారు. ప్రజలు ఆయన్ను తిరస్కరిస్తున్నారని, అందువల్లే బీకే పార్థసారథి తన సొంత పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థిని, వార్డులో వార్డుమెంబర్‌ను గెలిపించుకోలేకపోయారన్నారు. అలాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ పడతానని ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. కానీ జనరంజక పాలనతో రాష్ట్రంలోని అన్ని వర్గాలకు మేలు చేసిన పార్టీ వైఎస్సార్ సీపీ అన్నారు. అలాగే బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట వేసిన ఏకై క నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనన్నారు. అనంతరం ఆమె మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాయంలో ప్రజాప్రతినిధులు, వలంటీర్లు, యానిమేటర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, డీలర్లతో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సమీక్షించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకువెళ్లాలన్నారు. వచ్చే ఎన్నికల్లో జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవడానికి అందరం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
source : sakshi.com
Discussion about this post