రాష్ట్రంలో విద్యా విప్లవం సృష్టించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ సీఎం కావడం ఖాయమని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రమంతటా విద్యా వెలుగుల వ్యాప్తితోనే సీఎం జగన్ పేదరికానికి స్వస్తి పలకనున్నట్లు వెల్లడించారు. విద్యార్థి విభాగం వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు సాయిదత్త, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామలక్ష్మణ్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి షాహిద్ ఆధ్వర్యంలో శుక్రవారం పులివెందులలో జగనన్న కాలేజ్ కెప్టెన్స్ పరిచయ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హజరైన పానుగంటి చైతన్య మాట్లాడుతూ విద్యారంగంలో విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. జగనన్న రుణాన్ని కొంతైనా తీర్చుకునేందుకు ఎన్నికల రణరంగంలో ఆయనకు అండగా నిలవాలని విద్యార్థి లోకం యావత్తు సమష్టిగా, స్వచ్ఛందంగా నిర్ణయించుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అనంతరం పలు కళాశాలలకు చెందిన విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జగనన్న కాలేజ్ కెప్టెన్స్ విద్యార్థులతో మమేకమై జగనన్న హయాంలో జరిగిన మేలుపై వారిలో అవగాహన పెంచారు.
జగనన్న హయాంలో మారిన విద్యారంగ పరిస్థితులను సమగ్రంగా వివరించారు. పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించిన విద్యారంగం నాడు–నేడు కార్యక్రమాన్ని విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. అనంతరం పులివెందుల మార్కెట్‌యార్డు చైర్మన్ చిన్నప్ప, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ చేతుల మీదుగా విద్యార్థులకు జగనన్న కాలేజ్ కెప్టెన్ టీషర్ట్‌లను అందజేశారు.
source : sakshi.com
Discussion about this post