ఒక్కటీ మూతపడకూడదు
తరగతుల విలీనం, ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ కొత్త ప్రతిపాదనలవల్ల ఒక్క స్కూలు కూడా మూతపడే పరిస్థితి రాకూడదు. ప్రతి స్కూలు వినియోగంలో ఉండాల్సిందే.
2021 మే 19న సీఎం జగన్
ఒక్క బడి మూతపడినా నాదే బాధ్యత
జాతీయ విద్యా విధానంలో భాగంగా రాష్ట్రంలో పాఠశాలల విలీనాన్ని చేపడుతున్నాం. ఈ ప్రక్రియలో ఎక్కడైనా ఒక్క పాఠశాల మూతపడినా నాదే బాధ్యత
2022 జులై 16న మంత్రి బొత్స
మూతపడుతుంటే కనబడడం లేదా?
ఉపాధ్యాయులు, బడుల సంఖ్య తగ్గించేందుకు 3, 4, 5 తరగతులను ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో సర్కార్ విలీనం చేసింది. 1, 2 తరగతుల్లో సరిపడా పిల్లల్లేక రాష్ట్రవ్యాప్తంగా 118 ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయి. ఒక్క పాఠశాలా మూతపడకూడదన్న సీఎం, మూతపడితే బాధ్యత వహిస్తానన్న మంత్రి బొత్స ఎందుకు స్పందించరు? బడులు మూసేసి, పేదలకు చదువును దూరం చేయడం రూపుమార్చుకున్న అంటరానితనం కాదా? పెత్తందారీ పోకడ కాదా?
ఆ బడిలో రాత నేర్చుకుని.. ఎంతో మంది పేద పిల్లలు.. తమ తల రాత మార్చుకున్నారు. ఆ చదువులమ్మ చెట్టు నీడలో ఓనమాలు దిద్ది.. ఎందరో ప్రయోజకులయ్యారు! ఆ బడుల్లో చదివే పిల్లల్ని ఉద్ధరిస్తానని.. ఆ పాఠశాలల్ని ఆధునికీకరిస్తానని.. ఇంకా చాలా చాలా చెప్పి.. చివరాఖరికి తరగతుల విలీనం అన్నారు.. ఫలితంగా కొన్నిచోట్ల బడి దూరమైపోగా.. మరికొన్నిచోట్ల విద్యార్థుల్లేక వెలవెలబోతోంది.. ఇంకొన్ని చోట్ల ఏకంగా మూతబడింది!
నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ.. అంటూ కపట ప్రేమ చూపే సీఎం జగన్ ఆ వర్గాలకు చదువు అందకుండా చేస్తున్నారు. ప్రపంచ బ్యాంకు అప్పు కోసం.. భవిష్యత్తులో పాఠశాలల, ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించేందుకు తరగతుల విలీనం చేపట్టారు. ప్రాథమిక పాఠశాలలకు కిలోమీటరు దూరంలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఇప్పటికే 3, 4, 5 తరగతులను విలీనం చేశారు. దీన్ని మూడు కిలోమీటర్ల వరకు విస్తరించేందుకూ ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎన్నికల ముందు విలీనం ఇబ్బందిగా మారుతుందనే ఉద్దేశంతో ఒక్క కిలోమీటరుతోనే నిలిపివేశారు.
విలీనం కోసం.. కిలోమీటరు దూరంలో ఉండాల్సిన 3, 4, 5 తరగతులను 3కి.మీ.దూరం వరకూ ఉండొచ్చని విద్యా హక్కు చట్టంలో సవరణ తీసుకొచ్చారు. తరగతుల విలీనం కారణంగా 1, 2 తరగతుల్లో విద్యార్థులు తగ్గిపోయి.. ఇప్పటికే 118 బడులు మూతపడగా.. మరిన్ని చరిత్రలో కలిసిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. విలీనం చేసిన పాఠశాలలు ఎక్కువగా ఎస్సీ, బీసీ కాలనీలకు చెందినవే. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం ఆర్.ఏనుగుపల్లిలోని యల్లమెల్లివారిపేట, బెల్లంపూడి అరుంధతీయపేట ప్రాథమిక పాఠశాలలు పూర్తిగా ఎస్సీ ప్రాంతాల్లోనివే. కారుపల్లిపాడులోని ఎంపీపీ పాఠశాల ఎస్సీ, బీసీ ప్రాంతాలకు చెందినది. వీటిల్లో చదివేవారందరూ పేదవారే. ఈ బడులు మూతపడిన కారణంగా ఆయా వర్గాలకు కచ్చితంగా విద్య దూరమవుతుంది.
source : eenadu.net
Discussion about this post